Parvathipuram: బియ్యలవలసలో జలకళ: ఇర్రిడి గెడ్డ డ్యామ్‌కు పూర్వ వైభవం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా బియ్యలవలసలో 'జలధార - జలహారతి' ప్రాజెక్ట్.
Parvathipuram: బియ్యలవలసలో జలకళ: ఇర్రిడి గెడ్డ డ్యామ్‌కు పూర్వ వైభవం!
పార్వతీపురం మన్యం జిల్లా: వర్షపు ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది. నేలపై పడిన ప్రతి నీటి బొట్టుని వృథా కాకుండా భూమిలో నిల్వచేసి రైతుకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార - జలహారతి కార్యక్రమం పార్వతీపురం జిల్లాలో ప్రజలు మరియు పశు సంపదకు జీవం పోస్తోంది.
కురుపాం మండలంలోని బియ్యలవలస గ్రామ రైతాంగానికి ఇర్రిడి గెడ్డ డ్యామ్ ఒక ప్రాణాధారం. సుమారు 140 ఎకరాల సువిశాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ ప్రధాన వనరు, కొన్నేళ్లుగా పూడికతో నిండిపోయి ప్రాభవాన్ని కోల్పోయింది. డ్యామ్ గర్భంలో భారీగా మట్టి పేరుకుపోవడం, నీటిని విడుదల చేసే కీలకమైన తూములు మట్టి మేటలతో పూర్తిగా మూసుకుపోవడం మరియు ప్రధాన కాలువలు దెబ్బతినడం వల్ల సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయకట్టు పరిధిలోని పంట భూములు ఎండిపోయి, రైతుల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. రైతులు తమ శక్తినంతా కూడగట్టుకుని స్వయంగా పూడిక తీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, సమస్య పరిష్కారానికి సాంకేతిక నైపుణ్యంతో కూడిన శాశ్వత ప్రణాళిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో 'జలధార' కార్యక్రమం బియ్యలవలస రైతుల పాలిట వరంలా మారింది. నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో డ్యామ్ పునరుద్ధరణ పనులకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డ్యామ్ అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టిని శాస్త్రీయంగా తొలగించడమే కాకుండా, శిథిలావస్థకు చేరిన తూములను అధునాతన పద్ధతుల్లో పునర్నిర్మించేలా, ప్రధాన కాలువలకు మెరుగులు దిద్ది, డ్యామ్ చుట్టూ రక్షణ గోడ వంటి కందకాలను నిర్మించడం ద్వారా నీరు వృథా కాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ అభివృద్ధి పనుల వల్ల డ్యామ్ తన పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా, పంట పొలాల చిట్టచివరి భూములకు కూడా సాగునీరు అందేలా మార్గం షుగమాం కానుంది.
చేపట్టిన పనులు పూర్తి అయినవెంటనే ఈ డ్యామ్ జలకళతో పరవళ్లు తొక్కుతుండటంతో అటు వ్యవసాయం, ఇటు భూగర్భ జలాల లభ్యత గణనీయంగా పెరగనున్నాయి. చుట్టుపక్కల బావుల్లో మరియు బోరు బావుల్లో నీటి మట్టం పెరగడం వల్ల రైతులు ఇప్పుడు ధైర్యంగా సాగు పనులను చేపడతారు. పంటల దిగుబడి పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది.
జలధార జలహారతి భాగంగా చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక చర్య, గ్రామీణ వ్యవసాయాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచి విజయగాథను చాటుతోంది.




