Kurupam: చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం: కురుపాం ఎస్సై!
Kurupam: కురుపాంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ మరియు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు జరిగింది.
Kurupam: చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం: కురుపాం ఎస్సై!
కురుపాం, జూలై 14: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కురుపాం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో విద్యార్థినులకు రోడ్డు భద్రత, సైబర్ భద్రత, యాంటీ డ్రగ్స్ మరియు మహిళలపై నేరాల నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థినులకు వివరించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి యువత వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణకు చట్టపరమైన రక్షణలు, అత్యవసర సహాయ సేవలు, పోలీసు శాఖ అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. ఏదైనా వేధింపులు, అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఎస్సై నారాయణరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.




