Vizianagaram: విజయనగరం సీతంలో ఘనంగా 'నషా ముక్తి మహా అభియాన్'
Vizianagaram: విజయనగరం సత్య ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా నషా ముక్తి మహా అభియాన్-2026. పాల్గొన్న డీఎస్పీ రాఘవులు, విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు.
Vizianagaram: విజయనగరం సీతంలో ఘనంగా 'నషా ముక్తి మహా అభియాన్'
విజయనగరం: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “10 కోట్ల నషా ముక్తి మహా అభియాన్–2026” కార్యక్రమాన్ని బ్రహ్మకుమారీస్ విజయనగరం కేంద్రం ఆధ్వర్యంలో సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సీతంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బ్రహ్మకుమారీస్ విజయనగరం కేంద్ర నిర్వాహకురాలు రాజయోగిని సోదరి అన్నపూర్ణ, సీనియర్ సోదరి సరస్వతి మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరమని, విలువలతో కూడిన జీవన విధానం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చింతన ద్వారానే ఈ సామాజిక సమస్యను అధిగమించవచ్చని వివరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నషా ముక్తి ఉద్యమ లక్ష్యాలను విద్యార్థులకు వివరించి, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయనగరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాఘవులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడిన వారి జీవితం, కుటుంబం, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయని, ఇందులో ప్రమేయం ఉన్నవారిపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం డీఎస్పీ రాఘవులు విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నషా ముక్తి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడైనా మాదకద్రవ్యాలు లేదా ఇతర వ్యసనాలకు సంబంధించిన ప్రలోభాలు ఎదురైనప్పుడు మొదటిసారే ధైర్యంగా “నో” చెప్పగలిగితే జీవితమంతా సురక్షితంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు.
ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుందని, ఒక్క మంచి నిర్ణయం జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన కుటుంబం, స్నేహితులు, సమాజంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు బ్రహ్మకుమారీస్ మెడికల్ వింగ్ తరఫున రాజయోగిని సోదరి అన్నపూర్ణ సీతంకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో సీతం ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసరావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “వ్యసనాలకు దూరం… ఆరోగ్యవంతమైన యువతే వికసిత భారతానికి బలమైన పునాది” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.




