Vizianagaram: విజయనగరం ఓటరు జాబితా సవరణకు సహకరించండి
Vizianagaram: విజయనగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కలెక్టర్ సమీక్ష. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల. పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని రాజకీయ పార్టీలకు విన్నపం.
Vizianagaram: విజయనగరం ఓటరు జాబితా సవరణకు సహకరించండి
విజయనగరం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్‌ఐఆర్ రీషెడ్యూల్, ప్రస్తుత పురోగతి, తదుపరి కార్యాచరణపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15,78,949 మంది ఓటర్లకు గాను 14,50,744 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు ఇప్పటికే డిజిటలైజేషన్ పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 1,28,205 మంది ఓటర్లు ఆబ్సెంట్, షిఫ్టింగ్, డెత్ (ASD) జాబితాలో ఉన్నారని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మరో 10 రోజుల గడువు పొడిగించిన నేపథ్యంలో, ఈ జాబితాలో ఉన్న వారి వివరాలను పునః పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి (హౌస్ టు హౌస్) రీ వెరిఫికేషన్ నిర్వహిస్తారని వివరించారు.
2002 ఓటరు జాబితాతో పోల్చడం అంటే అప్పట్లో సంబంధిత వ్యక్తికి ఓటు ఉండాలనే అర్థం కాదని, వారి తల్లిదండ్రులు లేదా తాత, ముత్తాతల పేర్లు అప్పటి ఓటరు జాబితాలో ఉన్నా సరిపోతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉద్యోగం, విద్య లేదా ఇతర కారణాలతో తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, వారి బంధువులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని తెలిపారు.
ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను వివరిస్తూ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల విచారణ మరియు పరిష్కార ప్రక్రియ చేపడతామని, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించి, ఎవరూ ఓటరు జాబితాలో నుంచి మిగిలిపోకుండా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు, ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.ఎల్.వి. ప్రసాద్, పి.హెచ్. అప్పారావు, ఎస్. శ్రీనివాసరావు, ఎ. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




