Vizianagaram: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్
Vizianagaram: విజయనగరం జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు.
Vizianagaram: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్
విజయనగరం: జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి నీరు అందించే విధంగా సిద్ధం చేయాలంటే, ఇంకా సేకరించాల్సిన భూమిని త్వరగా సమీకరించాలని సూచించారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూమి, ఇప్పటికే సేకరించిన భూమి, ఇంకా సేకరించాల్సిన భూమి, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలు, పరిహారం చెల్లింపులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూముల రికార్డులు, యాజమాన్య హక్కులు, సర్వే, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు.
ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పూసపాటిరేగ మండలం జి.చోడవరం టాయ్ పార్క్, బొండపల్లి అంబటివలస, గరివిడి, గజపతినగరం మరుపల్లి, ఎల్.కోట శ్రీరాంపురం–మల్లెవీడు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, కొత్తవలస ఇన్ఫ్రా వెంచర్స్, బాడంగి ఆకులకట్ట ఫుడ్ పార్క్, రేగిడి ఆమదాలవలస గొల్లపాడు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించిన భూసేకరణపై సమీక్షించారు. భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద ప్రతిపాదిత డేటా సెంటర్, గుర్ల మండల పారిశ్రామిక పార్కు భూముల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకున్నారు.
తోటపల్లి బ్యారేజ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఆర్‌ఓబీ పనులతో పాటు పెందుర్తి–బౌదార ఎన్‌హెచ్-516(బి), రాయ్‌పూర్–విశాఖపట్నం ఎన్‌హెచ్-130సీడీ, విజయనగరం–సంభాల్‌పూర్ మూడో రైల్వే లైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణ పురోగతిని సమీక్షించారు.
భూయజమానులకు చట్టప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ అవార్డుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్ కుమార్, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, ఆన్‌లైన్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




