Vizianagaram: తుఫాను సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి కొండపల్లి
Vizianagaram: తుఫాను ప్రభావం నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.
Vizianagaram: తుఫాను సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి కొండపల్లి
విజయనగరం: తుఫాను ప్రభావం అనంతరం ప్రజలకు మేలైన సౌలభ్యాలు కలిగించేందుకు అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ముఖ్యంగా వరద ప్రభావం కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైనచోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. అలాగే రైతన్నలు పంటలను కోల్పోకుండా వ్యవసాయ అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, వరద ముంపుకు గురైన పంట పొలాలను కాపాడే విధంగా సలహాలు సూచనలు అందించాలన్నారు.
నష్ట నివారణకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలను రైతన్నలకు వివరించాలన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పశువులకు సైతం వ్యాధులు సోకే అవకాశం ఉందని, పశు వైద్యులు సైతం మూగ జీవాలను కాపాడే చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పారిశుధ్యం మెరుగలదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు వారి పని వారు చేస్తారని, ప్రజలు కూడా ఇంటి పరిసరాలలో మురుగునీరు, వరద నీరు, చెత్త నిలవలు లేకుండా చూసుకోవాలని, తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు.
ఇప్పటికే వరద ప్రవాహంతో రహదారులు కోతకు గురయ్యాయని, అటువంటి ప్రాంతాలను పోలీసు, రెవెన్యూ అధికారులు గుర్తించి రాకపోకలను నిషేధించారని, ప్రమాదాల నివారణకు వాహనదారులు గమనించి రాకపోకలు సాగించాలన్నారు.
ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అవాంతరాలు కలగకుండా వెనువెంటనే తొలగించి ఆర్ అండ్ బి, పోలీసు శాఖ వారు పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా వరద ప్రవాహాల వద్దకు చిన్నారులు వెళ్ళకుండా చూసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.




