Vizianagaram: అధ్యాపకులకు క్వాంటమ్ కంప్యూటింగ్‌పై వారం రోజుల శిక్షణ!

Vizianagaram: విజయనగరం సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ఎడునెట్ ఫౌండేషన్, ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ఆధ్వర్యంలో ఏజెంటిక్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై వారం రోజుల ఎఫ్‌డీపీ ప్రారంభమైంది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 16 Oct 2026 3:36 PM IST
Vizianagaram
X

Vizianagaram: అధ్యాపకులకు క్వాంటమ్ కంప్యూటింగ్‌పై వారం రోజుల శిక్షణ!

విజయనగరం, అక్టోబర్ 16, 2026: స్థానిక గాజులరేగ పరిధిలోని సీత కళాశాలలో ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలపై అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. అక్టోబర్ 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎడునెట్ ఫౌండేషన్, ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ సహకారంతో కళాశాలలోని ఆర్&డి కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయం అకడమిక్ ఆడిట్ మరియు ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. జయసుమ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం నేటి అధ్యాపకులకు ఎంతో అవసరమని అన్నారు.

ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించడంతో పాటు పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కృత్రిమ మేధస్సును బోధన, పరిశోధన రంగాల్లో వినియోగించుకునే క్రమంలో నైతిక విలువలు, సమాచార భద్రత, బాధ్యతాయుతమైన విధానాలను పాటించాలని పేర్కొన్నారు. నిరంతర అభ్యాసం ద్వారా అధ్యాపకులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని, విద్యార్థులను భవిష్యత్తు సాంకేతిక సవాళ్లకు సిద్ధం చేయాలని ఆకాంక్షించారు.

సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ, ఏజెంటిక్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అధ్యాపకులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య నైపుణ్యాల అంతరాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ, విద్యారంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధ్యాపకులు తమ బోధనా పద్ధతులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. నూతన సాంకేతికతలను నేర్చుకోవడం ద్వారా బోధనను మరింత ప్రభావవంతంగా మార్చడంతో పాటు విద్యార్థులకు మెరుగైన అభ్యసన అనుభవాలను అందించవచ్చని పేర్కొన్నారు.

సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సాయి దేవమణి మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక ప్రపంచంలో అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక అంశాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, వాటిని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించే విధానాలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

సీతం కళాశాల డీన్–రీసెర్చ్ డాక్టర్ వి.జి. ప్రసూన మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు పరిశోధనలకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు పరిశోధన ప్రక్రియలను వేగవంతం చేయడంతో పాటు సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అన్వేషించడంలో సహాయపడుతుందని వివరించారు. అధ్యాపకులు ఆధునిక సాంకేతిక సాధనాలను పరిశోధనల్లో వినియోగించుకుంటూ, నూతన ఆవిష్కరణలకు మరియు అంతరశాఖ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ వారం రోజుల కార్యక్రమానికి ఎడునెట్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ శ్రీ నరేంద్ర ఏలూరి ముఖ్య శిక్షణ నిపుణుడిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులకు ఏజెంటిక్ ఏఐ, సైబర్ భద్రత, క్వాంటమ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన కీలక అంశాలపై శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల, సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.