Vizianagaram: విధి ఆడిన వింత నాటకం..పెళ్లికి ముందే ప్రమాదం.. యువతి అకాల మరణం!

Vizianagaram: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో విషాదం. పెళ్లికి సిద్ధమవుతున్న యువతి రేణుక (18) ఆటో ప్రమాదంలో మృతి చెందింది.

Arun Chilukuri
Published on: 21 April 2026 10:39 AM IST
Vizianagaram
X

Vizianagaram: విధి ఆడిన వింత నాటకం..పెళ్లికి ముందే ప్రమాదం.. యువతి అకాల మరణం!

Vizianagaram: అప్పుడే పెళ్లి సందడి మొదలైంది.. కొత్త జీవితంపై ఆ అమ్మాయి ఎన్నో కలలు కన్నది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇంట పెళ్లి బాజాలకు బదులు చావు మేళం వినిపించింది. ఆటోలో నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి, నిశ్చితార్థం జరిగిన యువతి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదాన్ని నింపింది.

గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన బోనెల శ్రీను, వరలక్ష్మి దంపతుల కుమార్తె రేణుక (18) విజయనగరంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. నిరుపేద కుటుంబం కావడంతో తనే భారమంతా మోస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆదివారం షాపు ప్రచారం కోసం తోటి సిబ్బందితో కలిసి ఆటోలో వెళ్లిన రేణుక, పని ముగించుకుని తిరిగి వస్తుండగా నరవ గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచింది.

"వెళ్లొస్తానమ్మా" అని నవ్వుతూ వెళ్లిన బిడ్డ విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రికలు పంచాల్సిన సమయంలో కూతురి పార్థివ దేహాన్ని చూసి ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story