Vizianagaram: తాగునీటి ముసుగులో సాగునీటి దోపిడీ.. వైసీపీ నేతల ధ్వజం

Vizianagaram: గడిగడ్డ రిజర్వాయర్ నీటి తరలింపుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. 2,900 ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 April 2026 9:31 PM IST
Vizianagaram
X

Vizianagaram: తాగునీటి ముసుగులో సాగునీటి దోపిడీ.. వైసీపీ నేతల ధ్వజం

Vizianagaram: తాతావారికిట్టలి వద్దనున్న గడిగడ్డ రిజర్వాయర్ కింద సాగవుతున్న సుమారు 2900 ఎకరాల ఆయకట్టును బీడు భూములుగా మార్చేందుకు టిడిపి నేతలు కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ మండల శాఖ తీవ్రంగా మండిపడింది. శనివారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నేతలు మాట్లాడారు.

మండల పార్టీ అధ్యక్షులు పొట్నూరు సన్యాసినాయుడు మాట్లాడుతూ, "గడిగడ్డ రిజర్వాయర్ పూర్తిగా సాగునీటి ప్రాజెక్టు. దీని కింద 13 గ్రామాల రైతులు మూడు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు విజయనగరం ఎమ్మెల్యే తాగునీటి పేరుతో ఈ రిజర్వాయర్ నీటిని పట్టణానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగితే 2900 ఎకరాలు పూర్తిగా ఎడారిగా మారిపోతాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్సీపీ నేత కె.వి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, "విజయనగరం తాగునీటి సమస్యకు తోటపల్లి రిజర్వాయర్, నాగావళి నది వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని వదిలేసి రైతుల పొట్టకొట్టడం ఎంతవరకు న్యాయం?" అని ప్రశ్నించారు.

నేత బెల్లాన బంగారునాయుడు మాట్లాడుతూ, "ఉన్న ఒక్క రిజర్వాయర్ నీరు కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి? ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే 13 గ్రామాల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం" అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో నేతలు జమ్ము స్వామి నాయుడు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కింగువ మధుసూదన్ రావు, వరద ఈశ్వరరావు, గొర్లె నరసింహమూర్తి, మంత్రి వెంకటరమణ, బెల్లాను జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story