Mahabubabad: వేమునూరులో అరుదైన అద్భుతం.. ఒకే మొక్కకు 50 బ్రహ్మకమలాలు పూత!
Mahabubabad: మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామంలో ఒకే మొక్కకు ఏకంగా 50 బ్రహ్మకమలాలు పూసి అరుదైన అద్భుతాన్ని ఆవిష్కరించాయి. గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
Mahabubabad: వేమునూరులో అరుదైన అద్భుతం.. ఒకే మొక్కకు 50 బ్రహ్మకమలాలు పూత!
Mahabubabad: సాధారణంగా బ్రహ్మకమలం మొక్కకు ఒకటో , రెండో పూలు మాత్రమే పూయడం చూస్తుంటాం. కానీ.. ఒకే మొక్కకు ఒకేసారి ఏకంగా 50 పూలు పుష్పించిన అద్భుతమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా , మహబూబాబాద్ మండలం లోని వేమునూరు గ్రామం లో ఆవిష్కృతమైంది.
గ్రామానికి చెందిన కడియాల శ్రీనివాస్ ఇంటి ఆవరణలో పెంచుతున్న బ్రహ్మకమలం మొక్క.. ఒకే సారి 50 తెల్లటి పుష్పాలతో విరబూసి అందరినీ ఆశ్చర్యపరిచింది.సాధారణంగా అరుదుగా కనిపించే ఈ పుష్పాలు.. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే సారి వికసించడంతో గ్రామస్తులు ఈ అద్భుత దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఈ పూలు పగటిపూట కాకుండా రాత్రి వేళల్లోనే వికసిస్తాయి. చంద్రుని వెన్నెల్లో తెల్లని రేకులను విప్పుకుంటూ అందంగా విచ్చుకునే ఈ పుష్పాలు.. తెల్లవారేసరికి వాడిపోతాయి.అంతేకాదు.. వికసించిన సమయంలో వెదజల్లే మధురమైన సువాసన పరిసర ప్రాంతాలను ఆహ్లాదభరితంగా మారుస్తాయి.
హిందూ సంప్రదాయంలో బ్రహ్మకమలానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సృష్టికర్త బ్రహ్మదేవుని పేరుతో పిలవబడే ఈ పుష్పాన్ని పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు.సాధారణంగా ఈ మొక్కకు పూసే పూల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. అలాంటిది కడియాల శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఒకేసారి 50 పూలు వికసించడం స్థానికులకు కనువిందు చేసింది.
మొక్కకు సరైన పోషణ.. అనుకూలమైన వాతావరణం తోడవడంతో ఈ అద్భుతమైన పుష్ప విస్ఫోటనం చోటుచేసుకుంది.చీకటి తెరపై తెల్లటి నక్షత్రాలు విరిసినట్లుగా.. ఒకే మొక్కపై 50 బ్రహ్మకమలాలు పూయడంతో వేమునూరు గ్రామంలో ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.నిజంగా ప్రకృతి సృష్టించే అద్భుతాలకు హద్దులే లేవు కదా అని గ్రామస్తులు ముచ్చటించుకున్నారు.




