Maripeda: తండ్రి మొక్కు తీర్చేందుకు కొడుకు పాదయాత్ర!
Maripeda: దివంగత నాయకుడు నూకల నరేష్‌రెడ్డి అసంపూర్తి మొక్కు తీర్చేందుకు కురవి వీరభద్రస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన తనయుడు నూకల అభినవ్‌రెడ్డి.
Maripeda: తండ్రి మొక్కు తీర్చేందుకు కొడుకు పాదయాత్ర!
Maripeda: కురవి వీరభద్రస్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు స్వామివారిని ఆరాధ్యదైవంగా కొలుస్తూ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన దివంగత రాజకీయ ప్రముఖుడు నూకల నరేష్‌రెడ్డికి వీరభద్రస్వామిపై అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవని స్థానికులు తెలిపారు. స్వామివారికి పలు సందర్భాల్లో మొక్కుకున్న ఆయన, వాటిని చెల్లించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆ మొక్కులు అసంపూర్తిగా మిగిలాయి.
తండ్రి అసంపూర్తిగా మిగిల్చిన మొక్కులను కుమారుడు నూకల అభినవ్‌రెడ్డి కొనసాగించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ, కుటుంబ ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా పురుషోత్తమాయగూడెం నుంచి కురవి వీరభద్రస్వామి ఆలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు.
తండ్రి మొక్కును తనయుడు పాదయాత్ర ద్వారా కొనసాగించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాదయాత్ర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా తండ్రిపై తనకున్న గౌరవం, కుటుంబ విశ్వాసాల పట్ల తనకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.




