Bhupalpally: ఆస్పత్రి ఐసీయూలో ఏసీలు బంద్.. ఉక్కపోతతో రోగుల అవస్థలు!

Bhupalpally: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఏసీలు పనిచేయకపోవడంతో అత్యవసర స్థితిలో ఉన్న రోగులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RAJU, BHUPALAPALLI
Published on: 21 Aug 2026 10:27 PM IST
Bhupalpally
X

Bhupalpally: ఆస్పత్రి ఐసీయూలో ఏసీలు బంద్.. ఉక్కపోతతో రోగుల అవస్థలు!

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస వసతులు కరువవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐసీయూలో ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు నిరంతర పర్యవేక్షణ, అనుకూలమైన వాతావరణం అత్యంత కీలకం. అలాంటి ఐసీయూలోనే ఏసీలు పనిచేయకపోవడం ఆస్పత్రి నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బయట వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఐసీయూలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని బంధువులు చెబుతున్నారు.

పేరుకే వంద పడకల ఆస్పత్రి.. వసతుల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యమా? అంటూ రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలతో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, ప్రాథమికంగా అవసరమైన ఏసీల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐసీయూలో ఏసీలను వెంటనే మరమ్మతు చేసి, రోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, వైద్యాధికారులు స్పందించి ఐసీయూ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఐసీయూ వంటి అత్యవసర విభాగంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఆస్పత్రిలోని అన్ని కీలక పరికరాలు, వసతులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story