Mahabubabad: వేగంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: అనిల్ కుమార్!
Mahabubabad: మహబూబాబాద్‌లో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై పీపీసీ ఇన్‌ఛార్జులకు కలెక్టరేట్‌లో సమగ్ర శిక్షణ నిర్వహించారు.
Mahabubabad: వేగంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: అనిల్ కుమార్!
మహబూబాబాద్: వానకాలం (ఖరీఫ్) 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో మద్దతు ధర (MSP) వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో పిపిసి ఇన్‌ఛార్జులు, సిబ్బందికి మరియు సంబంధిత శాఖల అధికారులకు సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గ్రేడ్-ఏ (సన్న రకం) క్వింటాలుకు 2,461రూపాయలు కామన్ రకం క్వింటాలుకు 2,441 రూపాయలు, అదేవిధంగా ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న ధాన్యం రకాలకు క్వింటాలుకు 500 రూపాయలు అదనపు బోనస్ చెల్లిస్తారన్నారు.
బోనస్‌కు అర్హత పొందే 7 సన్న ధాన్యం రకాలలో BPT 5204, RNR 15048, HMT SONA, JAI SRIRAM SEGMENT, KNM 1638, WGL 44, మరియు KNM 7715 గా ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నమోదు, నాణ్యతా పరిశీలన, తూకం వివరాలు, రవాణా చలానాల నిర్వహణ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రూపొందించిన PCSAP యాప్ (PCSAP App) మరియు ట్యాబ్ ఎంట్రీలపై పిపిసి ఇన్‌ఛార్జులకు, డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రత్యక్షంగా డిజిటల్ శిక్షణ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల (PPC) వద్ద వసతులు & నాణ్యత రక్షణ
ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద తేమ కొలిచే యంత్రాలు (Moisture Meters), క్లీనర్లు, ప్యాడీ డ్రాయర్లు, తార్పాలిన్ కవర్లు, సరిపడా గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం 17% కంటే ఎక్కువ లేకుండా ఆరబెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తూకంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా లీగల్ మెట్రాలజీ అధికారుల ధృవీకరణ పొందిన కాంటాలను మాత్రమే వినియోగించాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత మిల్లులకు రవాణా చేసేలా వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.
ఈ సందర్బంగా వానకాలం (ఖరీఫ్) 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర (MSP) మరియు బోనస్ వివరాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎం.ఎస్.డి (MSD - Minimum Support Price & Grain Procurement) గోడ పోస్టర్‌ను జిల్లా అధికారులు ఆవిష్కరించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు, సన్న బియ్యం బోనస్ వివరాలు మరియు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే వసతుల గురించి రైతులకు స్పష్టమైన సమాచారం చేరవేయడమే ఈ పోస్టర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.
ఈ శిక్షణా సమావేశ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, ఇతర జిల్లా అధికారులు డి.ఆర్.డి.ఎ ఎ.పి.ఎం.లు, ప్యాక్స్ సి.ఈ.ఓలు, సంబంధిత సిబ్బంది మరియు పిపిసి ఇన్‌ఛార్జులు, తదితరులు పాల్గొన్నారు.




