Mahabubabad: ఏఐ సాంకేతికతతో విద్యార్థుల కలలకు రూపం ఇచ్చిన ఉపాధ్యాయులు!

Mahabubabad: పత్తిపాక ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐ సాంకేతికతతో విద్యార్థుల భవిష్యత్ కలల రూపాలను ఫొటోలుగా ప్రింట్ చేసి బహుమతిగా ఇచ్చారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 14 Nov 2026 11:38 AM IST
Mahabubabad
X

Mahabubabad: ఏఐ సాంకేతికతతో విద్యార్థుల కలలకు రూపం ఇచ్చిన ఉపాధ్యాయులు!

Mahabubabad: ప్రభుత్వ పాఠశాలలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ముందుకు సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ. ప్రతిభ నేతృత్వంలో ఉపాధ్యాయుల సమష్టి కృషితో పాఠశాల రూపురేఖలు మారుతున్నాయి.

రెండేళ్ల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 55కు చేరడం విశేషం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలని కలలు కంటున్నారో తెలుసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి వారు కోరుకున్న వృత్తిలో ఉన్నట్లుగా ఫొటోలను రూపొందించారు. వాటిని విద్యార్థులకు బహుమతులుగా అందజేసి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు.

డాక్టర్లు, ఇంజినీర్లు, పోలీసు అధికారులు, ఇతర వృత్తుల్లో స్థిరపడాలనే చిన్నారుల కలలకు ఈ బహుమతులు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభతో పాటు ఉపాధ్యాయురాలు ఝాన్సీ, డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న హైమావతి కీలక పాత్ర పోషించారు.

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం కూడా ఎంతో విలువైనదని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఈ పాఠశాల నిరూపిస్తోంది.

చిన్నారుల కలలకు రెక్కలు తొడుగుతూ ప్రభుత్వ బడుల అభివృద్ధికి బాటలు వేస్తున్న పత్తిపాక ఉపాధ్యాయుల కృషి అభినందనీయం. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అదరించాయి.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad