Warangal: వరంగల్‌లో అఖిలపక్ష సమావేశం సీఈసీ రాజీనామాకు డిమాండ్!

Warangal: వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 4 Oct 2026 4:01 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో అఖిలపక్ష సమావేశం సీఈసీ రాజీనామాకు డిమాండ్!

Warangal:భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లోని ఏ-1 ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు హాజరై, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

“CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అఖిలపక్షాల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 10:00 గంటలకు వరంగల్ పోచం మైదాన్ చౌరస్తా నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ చౌరస్తా వరుకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు అయూబ్ గారు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా పారదర్శకమైన విధానాలు ఉండాలని, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాలని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.

అదేవిధంగా, బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అయూబ్ గారు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అఖిలపక్షాలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన వరంగల్ పోచంమైదన్ నుండి హన్మకొండ అంబేద్కర్ వరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతినిధులని అన్నారు. అలాంటి పవిత్రమైన ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తినా వాటిని ఎన్నికల సంఘం అత్యంత బాధ్యతగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓటు అనేది ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కు. ఆ ఓటును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. ప్రజల ఓటు హక్కుపై అనుమానాలు కలిగించే పరిస్థితులు ఏర్పడితే వాటిని నివృత్తి చేయాల్సిందే.

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు” అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దెబ్బతీసే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పారదర్శకత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేరా కార్పొరేషన్ చైర్మన్ సంఘ్ వెంకటరాజ్యం, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్, CPI జిల్లా కార్యదర్శి షేక్ బస్మియా, సీపీఐ నాయకురాలు రత్నమాల, జిల్లా జాయింట్ కన్వీనర్ సయ్యద్ ఫైజుల్లా, టీడీపీ జిల్లా నాయకులు రఘు, అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు హకీమ్ నవీద్, తో పాటు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST