Hanumakonda: ఆసియా పారా గేమ్స్ విజేత దీప్తి జీవంజికి ఘన సన్మానం!

Hanumakonda: జపాన్‌లో జరిగిన ఆసియా పారా గేమ్స్–2026లో స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ దీప్తి జీవంజిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండలో ఘనంగా సన్మానించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 3:11 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఆసియా పారా గేమ్స్ విజేత దీప్తి జీవంజికి ఘన సన్మానం!

హనుమకొండ: జపాన్‌లో ఇటీవల నిర్వహించిన ఆసియా పారా గేమ్స్‌–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ, వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవంజిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ఘనంగా సన్మానించి అభినందించారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దీప్తి జీవంజిని శాలువాలతో సత్కరించి, ఆమె సాధించిన అద్భుత విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

జపాన్‌లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌–2026లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి జీవంజి కేవలం 56.36 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు తన ప్రతిభతో రికార్డు సృష్టించడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ రాష్ట్రం పేరును మారుమోగించి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన దీప్తి జీవంజి విజయం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ.. క్రీడల్లో విజయం సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఎంతో అవసరమని, ఈ లక్షణాలకు దీప్తి జీవంజి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి స్వర్ణ పతకం సాధించడం అభినందనీయమని తెలిపారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అసాధ్యమనుకున్న లక్ష్యాలను సైతం సాధించవచ్చని దీప్తి తన విజయంతో నిరూపించారని పేర్కొన్నారు.

దీప్తి సాధించిన ఈ విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాదని, ఎందరో యువతీ యువకులకు, ముఖ్యంగా పారా క్రీడాకారులకు కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసాన్ని అందించే గొప్ప విజయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల్లోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారికి సరైన ప్రోత్సాహం, శిక్షణ, అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించగలరని తెలిపారు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన దీప్తి జీవంజి అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం, సహకారం ఉంటుందని తెలిపారు. అ

నంతరం దీప్తి జీవంజిని మరోసారి అభినందిస్తూ, రాబోయే అంతర్జాతీయ పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి క్రీడాకారిణికి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దీప్తి జీవంజీని తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్