Atmakur: సోలార్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి కలెక్టర్ చాహత్

Atmakur: హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌లో మోడల్ సోలార్ విలేజ్ పథకంపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమీక్ష. ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల అమరిక వేగవంతం చేయాలని ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 July 2026 3:04 PM IST
Atmakur
X

Atmakur: సోలార్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి కలెక్టర్ చాహత్

ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూర్ గ్రామంలో అమలవుతున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద మిగిలిన లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం ఆత్మకూర్ గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ పథకం అమలును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గొల్లపల్లి గణపతి నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను పరిశీలించి, దాని పనితీరు, నిర్వహణ విధానం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై వారితో మాట్లాడారు.

అనంతరం గ్రామంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పురోగతిపై తెలంగాణ రెడ్‌కో, విద్యుత్ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మొదటి విడతలో అర్హులైన 764 మంది లబ్ధిదారులకు సోలార్ యూనిట్లు మంజూరుకాగా, ఇప్పటివరకు 251 ఇళ్లలో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్లకు అవసరమైన సామగ్రిని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చి, ఏర్పాటు పనులను పూర్తి చేస్తామని కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపికైన ఆత్మకూర్ గ్రామంలో మిగిలిన లబ్ధిదారుల ఇళ్లలో కూడా సోలార్ యూనిట్ల ఏర్పాటు ఆలస్యం కాకుండా అవసరమైన మెటీరియల్‌ను వెంటనే సమీకరించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ మహేశ్వరి, టీజీ రెడ్‌కో ఫీల్డ్ అధికారులు దీపక్, నవీన్ కుమార్ యాదవ్, ఆత్మకూర్ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు భరత్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story