Bhupalpally: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

Bhupalpally: జయశంకర్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులు, పోలీసుల తోపులాట జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Aug 2026 9:02 AM IST
Bhupalpally
X

Bhupalpally: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేసే అంశంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్‌తో పాటు బీటెక్ లేటరల్ ఎంట్రీ, ఉద్యోగ అర్హతలకు ఎలాంటి నష్టం కలిగించవద్దంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానించడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల డిప్లొమా విద్యార్థుల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

డిప్లొమా విద్యార్థుల విద్యా అర్హతలు, బీటెక్ లేటరల్ ఎంట్రీ అవకాశాలు, ఉద్యోగ అర్హతలకు ఎలాంటి నష్టం కలిగించవద్దని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు వెనక్కి వెళ్లాలంటూ విద్యార్థులు “గో బ్యాక్ పోలీస్” అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఘటనలో విద్యార్థుల వాచీలు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో కొద్దిసేపు కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story