Hanamkonda: హనుమకొండలో ఘనంగా కల్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవ వేడుకలు!

Hanamkonda: కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హనుమకొండలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 6:45 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో ఘనంగా కల్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవ వేడుకలు!

Hanamkonda: తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి తల్లిదండ్రుల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హనుమకొండలోని వడ్డేపల్లి జంక్షన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక పథకాల్లో కల్యాణలక్ష్మి ఒకటని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి అంటే తల్లిదండ్రులకు ఆర్థికంగా పెద్ద సవాలుగా ఉండే పరిస్థితుల్లో, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనే ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు.

పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ అండ

కల్యాణలక్ష్మి కేవలం ఆర్థిక సహాయ పథకం మాత్రమే కాదని, పేదింటి ఆడబిడ్డ వివాహాన్ని ప్రభుత్వమే తన బాధ్యతగా భావించిన సంక్షేమ దృక్పథానికి ప్రతీక అని వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పేదలు, మహిళలు, రైతులు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు.

ఆడబిడ్డ పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితులను తగ్గించేందుకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో దోహదపడిందని అన్నారు. తెలంగాణ సమాజంలో ఆడబిడ్డకు గౌరవం, భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ పథకం నిదర్శనమని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలే కేసీఆర్ పాలనకు గుర్తింపు

కేసీఆర్ హయాంలో తెలంగాణలో అమలైన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకువచ్చాయని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలను మార్చే సంక్షేమ పథకాల ప్రాధాన్యతను విస్మరించకూడదు ఇలాంటివి ఏకంగా కళ్యాణలక్ష్మి పథకానికే స్వస్తి పలకడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి సంబంధించిన పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

“కేసీఆర్ అంటేనే సంక్షేమం”

వడ్డేపల్లి జంక్షన్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ, కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు అందిన ప్రయోజనాలను గుర్తు చేసుకున్నారు.

“ఆడబిడ్డల పక్షాన కేసీఆర్.. పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి భరోసా” అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు,మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు,బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్