Hanamkonda: కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఘోర వైఫల్యం పరకాల మాజీ ఎమ్మెల్యే
Hanamkonda: కాంగ్రెస్ 1000 రోజుల పాలన విఫలమైందని హన్మకొండలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శ. వారం రోజుల పాటు బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలు.
Hanamkonda: కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఘోర వైఫల్యం పరకాల మాజీ ఎమ్మెల్యే
Hanamkonda: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వారంపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు.
మంగళవారం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ధర్మారెడ్డి.. ప్రభుత్వ వైఫల్యాలపై 2న చార్జ్‌షీట్ విడుదల చేసి నియోజకవర్గాల్లో ధర్నాలు, 3న రైతు సదస్సులు, 5న యూత్ ర్యాలీలు, 6న సింగరేణి మైన్స్ వద్ద నిరసనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేస్తామని పేర్కొన్నారు.
రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. రైతులకు యూరియా కొరత, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ హామీ అమలు కాకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టబడిందని ధర్మారెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పే వరకు బీఆర్‌ఎస్ ప్రజాపోరాటం కొనసాగుతుందని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




