Hanumakonda: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు కలెక్టర్ కీలక ఆదేశాలు!

Hanumakonda: హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుధ్యం, వర్షాకాల సన్నద్ధత.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 July 2026 9:23 PM IST
Hanumakonda
X

Hanumakonda: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు కలెక్టర్ కీలక ఆదేశాలు!

హనుమకొండ, జులై 16: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని, నగర పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.

గురువారం హనుమకొండ కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ట్రేడ్ లైసెన్సుల వసూళ్లు, బయోమెట్రిక్ హాజరు, ప్లాస్టిక్ నియంత్రణ, వర్షాకాల సన్నద్ధత తదితర అంశాలపై డివిజన్ల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జీడబ్ల్యూఎంసీ పరిధిలో పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ఆదాయ వసూళ్లలో పారదర్శకత తీసుకురావాలని, ట్రేడ్ లైసెన్సుల వసూళ్లను వేగవంతం చేసి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి,వర్షాకాలంలో మురుగునీరు నిల్వ కాకుండా నగరంలోని అన్ని అంతర్గత మురుగుకాలువల్లో 100 శాతం డీ-సిల్టింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట యంత్రాలతో పాటు గ్యాంగ్‌మెన్‌లను వినియోగించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

నగరంలో ప్రతిరోజూ కనీసం 400 టన్నుల ఘన వ్యర్థాల సేకరణ జరిగేలా శానిటరీ సూపర్వైజర్లు, జవాన్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అన్ని పారిశుధ్య వాహనాలు, కంటైనర్లు, ట్రాక్టర్లు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలని, మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తి చేసి పారిశుధ్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి,తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించాలని, ప్రస్తుతం తడి చెత్త సేకరణ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటూ దానిని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నాలుగు మోడల్ కాలనీల్లో అమలు చేస్తున్న విధానాన్ని సమీక్షిస్తూ, తదుపరి సమావేశం నాటికి తడి చెత్త సేకరణ వ్యవస్థను పూర్తిగా క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.

జీడబ్ల్యూఎంసీ పరిధిలోని అన్ని స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్ మ్యాపింగ్ పూర్తి చేసి, ప్రతిరోజూ కేటాయించిన ప్రాంతాలను 100 శాతం కవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు ఘన వ్యర్థాల నిర్వహణ (SWM)పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి స్వచ్ఛ ఆటో రోజుకు కనీసం రెండు ట్రిప్పులు చేసి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు చెత్త తరలించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

వ్యర్థాల నిర్వహణలో వినూత్న చర్యలు,వ్యర్థ కొబ్బరి బొండాలను వినియోగిస్తూ కోకో కాయర్ యూనిట్ల ఉత్పత్తి పెంచాలని, అలాగే 15 KLD, 150 KLD సామర్థ్యాల ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (FSTP) నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి ప్రతిరోజూ డీ-స్లడ్జింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్లాస్టిక్ నియంత్రణ – ప్రజల భాగస్వామ్యం అవసరం,సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహించాలని, అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు.

ప్రజలను ప్లాస్టిక్ రహిత జీవనశైలికి ప్రోత్సహించేలా జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం, ఎక్సైజ్ కాలనీ మార్కెట్ వద్ద ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేసే వారికి బట్ట సంచులు, నిత్యావసర వస్తువులు లేదా ప్రోత్సాహక నగదు అందించే విధానాన్ని రూపొందించాలని సూచించారు.

నగర సుందరీకరణకు ప్రాధాన్యం.నగరంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్లు, బండ్ ప్రాంతాల్లో ప్రకృతి పరిరక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే నేచర్-బేస్డ్ వాల్ ఆర్ట్, ప్రేరణాత్మక సందేశాలతో కూడిన పెయింటింగ్స్ రూపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు,నివాస ప్రాంతాల్లో పందుల పెంపకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, హసన్‌పర్తిలో రెండో ఏబీసీ (Animal Birth Control) కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. లాండ్రోమార్ట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, వాటర్‌లాగింగ్ ప్రాంతాలు, మురుగు కాలువల పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వల్ చర్యలను ముమ్మరం చేయాలని, ఏ ప్రాంతంలోనైనా వ్యాధులు ప్రబలితే అక్కడ ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టి వెంటనే ఫాగింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, ఆస్కీ ప్రతినిధి రాజమోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story