Elkathurthi: ఎల్కతుర్తిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. స్కూల్ పిల్లలకు పాఠాలు
Elkathurthi: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
Elkathurthi: ఎల్కతుర్తిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. స్కూల్ పిల్లలకు పాఠాలు
ఎల్కతుర్తి: గ్రామాభివృద్ధికి పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్య మూడు ప్రధాన స్తంభాలని, వీటి సమన్వయంతో గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. శుక్రవారం ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సెగ్రిగేషన్ షెడ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను పరిశీలించారు.
ముందుగా గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించిన కలెక్టర్ తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు కంపోస్ట్ ఎరువు తయారీ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం
అనంతరం ఊర చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్, కూలీల హాజరు, పనుల పురోగతి, వేతనాల చెల్లింపులపై ఆరా తీశారు. చెరువు పూడికను వ్యవసాయ భూములకు తరలించడం ద్వారా భూసారం పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం సంతోషకరమని, వ్యవసాయ విరామ సమయంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అన్నారు. చెరువు కట్ట చుట్టూ విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించిన కలెక్టర్, ప్రకృతి వనరుల సంరక్షణతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి
జీల్గుల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. గణితం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం వంటి అంశాల్లో విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మమేకమైన కలెక్టర్ సాంఘిక శాస్త్రంలోని అంశాలను బోధిస్తూ భారతదేశ భౌగోళిక స్వరూపం, సరిహద్దుల గురించి వివరించారు. ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు.
పాఠశాల దశలోనే బలమైన విద్యా పునాది ఏర్పడితే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శీను, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజు గౌడ్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సృజన తదితరులు పాల్గొన్నారు.




