Jangaon: జనగామలో వినాయక చవితి ముందస్తు ఏర్పాట్లపై కీలక భేటీ!

Jangaon: జనగామ జిల్లాలో గణేష్ నవరాత్రులు, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమన్వయ సమావేశం నిర్వహించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 9 Sept 2026 11:42 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో వినాయక చవితి ముందస్తు ఏర్పాట్లపై కీలక భేటీ!

జనగామ: ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం శాంతి కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జిల్లాలో మొత్తం (770) చెరువులు ఉన్నాయని, దాదాపుగా జిల్లాలో (2000) గణేష్ ప్రతిమల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.

గణేష్ మండపాల వద్ద రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, వీధి లైటింగ్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని డీపీఓకు ఆదేశించారు.

నిమజ్జన ఘాట్‌ల వద్ద భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సుమారు 12 అడుగుల లోతు వరకు బారికేడింగ్ చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బోట్లను సిద్ధంగా ఉంచడంతో పాటు ఈతగాళ్ల (స్విమ్మర్స్) బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, లైటింగ్, ట్రాఫిక్, నిమజ్జన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. నిమజ్జన ఘాట్‌లు, మండపాల వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ప్రతి ప్రధాన మండపం వద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

నిమజ్జన ప్రాంతాల్లో వైద్య బృందాలు, అవసరమైన మందులు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొబైల్ మెడికల్ టీమ్‌లను షిఫ్ట్‌ల వారీగా విధుల్లో ఉంచాలని డీఎంహెచ్ఓకు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనుమతించిన డెసిబెల్ పరిమితుల్లోనే సౌండ్ సిస్టమ్‌లు వినియోగించాలని తెలిపారు.

నిమజ్జన ఘాట్‌ల వద్ద భారీ క్రేన్‌లను ఏర్పాటు చేసి, సురక్షితంగా విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. క్రేన్ ఆపరేటర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓకు సూచించారు. జిల్లాలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలన్నారు.

విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం చేసేందుకు చెరువుకు వెళ్లే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ & బీ, ఈఈ పీఆర్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్‌తో పాటు ఘాట్ల వద్ద అదనపు జనరేటర్లు, హైమాస్ట్ లైట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా, క్రేన్లు సులభంగా నిలిచేందుకు, విగ్రహాలు నీటిలో సరిగా మునిగేందుకు నిమజ్జన పాయింట్ల వద్ద పూడిక తీత పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను అదేశించారు.

నీటిపారుదల అధికారులు నిమజ్జనం జరిగే చెరువులు, జలాశయాలు (లేదా) కాలువల్లో తగినంత నీటి మట్టం ఉందో, లేదో పర్యవేక్షించి, మండల అధికారులను సమన్వయం చేసుకొని నివేదికలు అందజేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ఘాట్ల వద్ద బలమైన బారికేడింగ్, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లతో కూడిన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను మోహరించాలన్నారు. అగ్నిమాపక శకటాలను (ఫైర్ ఇంజిన్లు) ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలన్నారు.

నిమజ్జనం రెండు రోజలు మద్యం దుకాణాలు తెరవరాదని, అమ్మకాలు చేపట్టరాదని, నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారికి సూచించారు. డివిజనల్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆర్డీఓలకు సూచించారు.

జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రతి గణేష్ మండపం వద్ద రాత్రి వేళల్లో ఒక బాధ్యతగల వ్యక్తి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రతి మండపంలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని చెప్పారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్రమబద్ధంగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను నమోదు చేసి, అనుమతి పొందాలని సూచించారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

తదనంతరం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి, పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మట్టి గణపతుల వినియోగంతో నీటి కాలుష్యం తగ్గడంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఈ సమన్వయ సమావేశంలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఘనపూర్ (స్టేషన్), వర్ధన్నపేట ఏసిపిలు భీం శర్మ, నర్సయ్య, మునిసిపల్ కమిషనర్ లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, డిపీఓ వెంకట్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, డీఎంహెచ్ఓ వాణి శ్రీ, ఆర్టీఓ శిల్ప, ఇతర శాఖల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story