Mahabubabad: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: కలెక్టర్ స్నేహ శబరీష్!

Mahabubabad: మహబూబాబాద్ బాలికల బాలసదనంలో ప్రపంచ బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం పాల్గొని చిన్నారులతో కలిసి భోజనం, బహుమతుల పంపిణీ చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 20 Nov 2026 5:05 PM IST
Mahabubabad
X

Mahabubabad: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: కలెక్టర్ స్నేహ శబరీష్!

మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకాంక్షించారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనంలో ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై బాలలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆనందోత్సాహాలను నింపారు.

ఈ సందర్భంగా బాలలు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమలోని ప్రతిభను చాటుతూ చిన్నారులు చేసిన నృత్యాలు, ఇతర ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .... క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.బాలలు ప్రతిరోజూ క్రీడల్లో సాధన చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభను పెంపొందించుకుంటూనే చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి సరైన దిశలో ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. బాలలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

బాలల దినోత్సవ వేడుకలు బాలసదనంలోని చిన్నారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ వేడుకలలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగవాణి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad