Hanumakonda: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి: సీఈఓ
Hanumakonda: తెలంగాణలో ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, నవంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కలెక్టర్లను సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
Hanumakonda: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి: సీఈఓ
Hanumakonda: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్-2026) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్.రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) జాబితాలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించాలని, సరైన విచారణ లేకుండా ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
డిలీషన్ జాబితాలో ఉన్న ప్రతి ఓటరు వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని, పేరు తొలగించడానికి గల కారణాలు, అందుకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ఓటరు నుంచి వచ్చిన అభ్యంతరాలు, వివరణలు, సమర్పించిన పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులు, ఫారం-7 ద్వారా వచ్చిన అభ్యంతరాలు, ఓటరు పేరు తొలగింపునకు సంబంధించిన అభ్యర్థనలు, ఫారం-8 ద్వారా వచ్చిన చిరునామా మార్పులు, ఓటరు వివరాల సవరణలు తదితర దరఖాస్తుల పరిష్కార స్థితిని నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఓటర్ల జాబితాలో పేరు చేర్పులు, తొలగింపులు, మార్పులకు సంబంధించి అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియజేస్తూ స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన నోటీసులు, నోటీసుల అందజేత వివరాలు, విచారణ నివేదికలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలు, సంబంధిత పత్రాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు సంబంధిత రికార్డులు అందుబాటులో ఉండేలా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.
నోటీసులు జారీ చేసిన ప్రతి ఓటరుకు నిబంధనల ప్రకారం స్పందించేందుకు, తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి దశలో తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా ఏఎస్‌డీ జాబితా, డిలీషన్ జాబితా, ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు అన్ని వివరాలను మరోసారి పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో, నవంబర్ 26, 2026వ తేదీలోగా నోటీసుల జారీ, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 30, 2026వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున, ఈ గడువులను దృష్టిలో ఉంచుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ జిల్లాలో ఫారం 6,7,8 లకు సంబంధించి ప్రస్తుతం 1000 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఫోటో రోల్స్ కు సంబంధించి బిఎల్ఓ స్థాయిలో పర్యవేక్షణ పూర్తయిందని ప్రస్తుతం కొన్ని ఈఆర్వో స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు సంబంధించి గత ఎన్నికలో 43 వేల729 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 47 వేల దరఖాస్తులు ఇప్పటికే అందినట్లు పేర్కొన్నారు.
ఇంకా కొత్త దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, దరఖాస్తుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డివో /ఈఆర్వో వెంకటేష్, హనుమకొండ తహసిల్దార్/ ఏఈఆర్ఓ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




