Hanumakonda: బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!

Hanumakonda: హనుమకొండ కేయూ జంక్షన్‌ వద్ద బీసీ సంఘాలతో కలిపి ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. జీవో 14ను రద్దు చేయాలని డిమాండ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 5:03 PM IST
Hanumakonda
X

Hanumakonda: బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!

Hanumakonda: కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 14 లో మార్పు చేయడాన్ని నిరసిస్తూ... ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, బీసీ ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం కేయూ జంక్షన్ ఎస్డీఎస్సీ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహం వద్ద పత్రికా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీసీ నేత విమర్శించారు. బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన భవన నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, కులవృత్తుల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి రూ.20 కోట్లు కేటాయించాల్సి ఉండగా, బడ్జెట్‌లో ఎంత కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, 42 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.

గతంలో బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన భూములకు సంబంధించి పలు జీవోలు జారీ చేసి, చివరకు జీవో నంబర్ 14 తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ జీవో కారణంగా బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

గౌడ కులస్తుల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, ఇతర కుల సంఘాల ప్రముఖ నాయకుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

కనీసం కార్యక్రమాలకు వచ్చే వారికి తాగునీరు, టీ, అల్పాహారం వంటి ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, బీసీలకు బీసీ బంధు వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూత అందించారని గుర్తుచేశారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా బీసీల ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.

కులవృత్తులపై ఆధారపడిన వర్గాలు పోటీ ప్రపంచంలో ఉపాధి కోల్పోతున్నాయని పేర్కొన్నారు. నేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాలకు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

చెరువుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.

జీవో నంబర్ 14 వెనుక పెద్ద కుట్ర ఉందని, బీసీలకు కేటాయించిన స్థలాల విషయంలో అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు.

ఈ జీవోను రద్దు చేసే వరకు బీసీ వర్గాల తరఫున దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ, దళిత విద్యార్థులు, కుల సంఘాలు ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాల స్ఫూర్తితో బీసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్