Dornakal: రూ.33 లక్షల బకాయిల కోసం స్కూలుకు తాళం!

Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళం వేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Jun 2026 2:31 PM IST
Dornakal
X

Dornakal: రూ.33 లక్షల బకాయిల కోసం స్కూలుకు తాళం!

డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన తొలి రోజే గ్రామంలోని MPPS పాఠశాల ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడం చర్చచాంశానియంమైంది. పాఠశాలకు వచ్చిన సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు వద్దే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు – మన బడి" కార్యక్రమం కింద నాలుగేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులకు రూ.40 లక్షల విలువైన టెండర్‌ను కాంట్రాక్టర్ రామనాథం దక్కించుకుని, కొత్త తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి చేశారు.

పనులు పూర్తయి మూడు సంవత్సరాలు గడిచినా తనకు రావాల్సిన బిల్లులు పూర్తిగా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.40 లక్షలలో ఇప్పటివరకు కేవలం రూ.7 లక్షలు మాత్రమే చెల్లించారని ఇంకా రూ.33 లక్షలు బకాయిగా ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లుల విడుదల కోసం పలుమార్లు సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

పనుల నిర్వహణ కోసం భారీ మొత్తంలో అప్పులు చేయగా అప్పు ఇచ్చినవారు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. వడ్డీలపై వడ్డీలు పెరుగుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా స్పందన లేకపోవడంతో చివరి మార్గంగా పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

"నా కష్టార్జిత డబ్బులు నాకు ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను పూర్తి చేశాను. కానీ నాకు రావాల్సిన బిల్లులు ఇవ్వడం లేదు. బకాయిలు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తే లేదు" అని కాంట్రాక్టర్ రామనాథం స్పష్టం చేశారు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిల అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story