Warangal: విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు: సీపీ శ్వేత, కమిషనర్!

Warangal: పబ్లిక్ స్కూల్ విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల వేళల్లో ట్రాఫిక్ నియంత్రణకు వరంగల్ సీపీ ఎన్. శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన జరిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 24 Aug 2026 11:38 PM IST
Warangal
X

Warangal: విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు: సీపీ శ్వేత, కమిషనర్!

వరంగల్: వరంగల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, GWMC కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు సోమవారం వరంగల్ పబ్లిక్ స్కూల్ నుంచి రాజ్ హోటల్ వరకు పోలీస్, బల్దియా, రోడ్లు–భవనాల శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేలా అవసరమైన చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా క్రమబద్ధీకరించడం, అనవసరమైన క్రాస్ మూమెంట్స్‌ను నియంత్రించడం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.

అలాగే రహదారి మధ్యలో ఉన్న డివైడర్లను పరిశీలించి, విద్యార్థులు, పాదచారులు అనధికారికంగా రోడ్డు దాటే అవకాశం ఉన్న ప్రాంతాల్లో డివైడర్ ఓపెనింగ్స్‌ను మూసివేయడం, అవసరమైన చోట్ల మాత్రమే ఓపెనింగ్స్ ఉంచడం వంటి చర్యలపై చర్చించారు. పాఠశాల పరిసరాల్లో వాహనాల పార్కింగ్, పాఠశాల బస్సుల రాకపోకలు, పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను కూడా పరిశీలించారు.

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా, పాఠశాల పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులు సూచించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెంచడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో బ్యారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, డీసీపీ సెంట్రల్ జోన్ ధార కవిత, ఏసీపీ ట్రాఫిక్ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారి, GWMC ఎస్‌ఈ రాజ్‌కుమార్, బల్దియా ఇంజనీరింగ్ అధికారులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story