Hanamkonda: హనుమకొండలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ!

Hanamkonda: హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ విడుదల చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 17 Aug 2026 10:57 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ!

హన్మకొండ: సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐఆర్ ఓటర్ల ముసాయిదా జాబితా పై అధికారులు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు, ఎస్ఐఆర్ ఇంటింటి సర్వే సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయిన వారి జాబితాను కూడా ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాలు ఈఆర్వో/ఆర్డీవో కార్యాలయాలు, ఏఈఆర్వో/తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్/వార్డు కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్ పోర్టల్, సీఈఓ వెబ్‌సైట్లో కూడా ముసాయిదా ఓటర్ల జాబితా, ఎన్యూమరేషన్ ఫారం సేకరించలేకపోయిన ఓటర్ల వివరాలను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

17-08-2026 నుంచి 16-09-2026 వరకు ఓటరుగా నమోదు కానివారు, కొత్తగా అర్హత సాధించిన వారు, వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించలేకపోయిన వారు తమ వివరాలను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ల వివరాల్లో సవరణలు అవసరమైతే ఫారం-8, ఓటర్ల జాబితాలోని వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా జాబితాల అందజేత ఈ సమావేశంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులకు 104-పరకాల, 105-వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రతులను అలాగే ఇల్లు మారిన ఓటర్లు , మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటరుగా నమోదు కావడం తదితర కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయిన ఓటర్ల వివరాలను కలెక్టర్ అందజేశారు. పిడిఎఫ్ రూపంలో నాన్ ఫోటో ఎలక్టరల్ రోల్, తిరిగి రాని ఎన్యుమరేషన్ ఫారముల సాఫ్ట్ కాపీ (DVD) ద్వారా మరియు పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం హనుమకొండ జిల్లాలో మొత్తం 4,07,317 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో 1,97,627 మంది పురుషులు, 2,09,675 మంది మహిళలు, 15 మంది ఇతరులు ఉన్నారని అన్నారు. 104-పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,03,598 మంది ఓటర్లు ఉండగా, వారిలో 98,913 మంది పురుషులు, 1,04,682 మంది మహిళలు, 3 మంది ఇతరులు ఉన్నారని చెప్పారు.

105-వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,03,719 మంది ఓటర్లు ఉండగా, వారిలో 98,714 మంది పురుషులు, 1,04,993 మంది మహిళలు, 12 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 46 మంది ఓవర్సీస్ (NRI), 246 మంది సర్వీస్ ఓటర్లు నమోదై ఉన్నారని వివరించారు.

అదేవిధంగా ఎస్ఐఆర్ ఇంటింటి పరిశీలనలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయిన లేదా సంబంధిత కారణాల వల్ల ముసాయిదా జాబితా నుంచి తొలగించబడిన ఓటర్ల సంఖ్య జిల్లావ్యాప్తంగా *1,01,697 (19.98 శాతం)*గా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో మరణించిన వారు – 14,757 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు – 77,054 మంది ఇప్పటికే వేరే ప్రాంతంలో ఓటరుగా నమోదైన వారు – 8,502 మంది ఉన్నారన్నారు.

నో మాపింగ్ , అనామాలీస్ ఓటర్లకు నోటీసులు మ్యాపింగ్ కాని (No Mapping) 50,806 మంది మరియు వ్యత్యాసాలు (Anomalies) ఉన్న 81,266 మంది ఓటర్లకు 17-08-2026 నుంచి 15-10-2026 వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ అర్హతను నిరూపించేందుకు SIR-2002 ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు/తాత పేరు ఉన్న వివరాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం సూచించిన అంగీకారయోగ్యమైన ధ్రువపత్రాల్లో తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. 01-07-1987 కంటే ముందు జన్మించిన వారు తమ స్వంత ఆధార పత్రాన్ని సమర్పించాలని,

01-07-1987 నుంచి 02-12-2004 మధ్య జన్మించిన వారు: తమ స్వంత ఆధార పత్రంతో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఆధార పత్రాన్ని సమర్పించాలని,

02-12-2004 తర్వాత జన్మించిన వారు తమ స్వంత ఆధార పత్రంతో పాటు తల్లి, తండ్రి ఇద్దరికీ సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలన్నారు. అంగీకరించబడే ఆధార పత్రాలు ప్రభుత్వం/PSU/బ్యాంకులు/పోస్టాఫీస్/LIC ద్వారా 01-07-1987 కంటే ముందు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా డాక్యుమెంట్.

సక్షమ అధికారి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం. పాస్‌పోర్ట్. పదో తరగతి లేదా విద్యార్హత ధ్రువీకరణ పత్రం. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం. OBC/SC/ST కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా పోలీసు, ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) వివరాలు, స్థానిక సంస్థలు నిర్వహించే కుటుంబ రిజిస్టర్.ప్రభుత్వం కేటాయించిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం సమర్పించాలన్నారు.

ఆధార్ కార్డును కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తారని, ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం అది పౌరసత్వానికి లేదా పుట్టిన తేదీ/నివాసానికి పూర్తి ఆధారంగా పరిగణించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు.

అప్పీల్‌కు అవకాశం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి/రెవెన్యూ డివిజనల్ అధికారి తిరస్కరించిన దరఖాస్తులు లేదా అభ్యంతరాలపై 15 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు మొదటి అప్పీల్ చేసుకోవచ్చని, మొదటి అప్పీల్ నిర్ణయంపై 30 రోజుల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO)కు రెండవ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా

SIR-2026 ప్రక్రియలో భాగంగా అన్ని దరఖాస్తులు, అభ్యంతరాలు, అప్పీళ్లను పరిశీలించిన అనంతరం 19-10-2026న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.

ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం,ఆర్డీవో కార్యాలయం, అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఈఆర్‌ఓ/హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, హనుమకొండ ఏఈఆర్‌ఓ/తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి.శ్రీనివాసరావు, రావు అమరేందర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, మచ్చ లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నాగబెల్లి రజనీకాంత్, సయ్యద్ ఫైజుల్లా, అంబాల ప్రశాంత్, అబ్దుల్ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story