Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదులో జాగ్రత్తలు: కలెక్టర్ సత్య శారద!
Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదులో జాగ్రత్తలు పాటించాలని, పోర్టల్లో నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదులో జాగ్రత్తలు: కలెక్టర్ సత్య శారద!
వరంగల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, లబ్ధిదారుల నమోదు కేంద్రాల పనితీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 18వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి బీమా పొందేందుకు ఎంపిక చేసిన వ్యక్తి వివరాలతో పాటు, వారి నామినీ పేరును తప్పనిసరిగా పథకం పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
బీమా పొందే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, నమోదు సమయంలో లబ్ధిదారుల ఆధార్, కుటుంబ వివరాలు, నామినీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నామినీలకు కేటాయించే వాటాల శాతం మొత్తం 100 శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పోర్టల్లో వివరాలు నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలని ఆదేశించారు. నమోదు కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, జెడ్పీ సీఈవో వసంత, డీపీవో కల్పన, సీపీవో చంద్రకళ, డీఆర్డీవో నాగపద్మజ, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.




