Palakurthi: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటా వార్పు నిరసన!

Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు నిరసన చేపట్టారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 7 Sept 2026 6:54 PM IST
Palakurthi
X

Palakurthi: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటా వార్పు నిరసన!

పాలకుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కరు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పాలకుర్తి చౌరస్తాలో మహిళలతో కలిసి వినూత్నంగా వంటా వార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషా దయాకర్ రావుతో పాటు పెద్ద ఎత్తున మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

​పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి సర్కార్ అంతా బూటకపు మాటల మాయాజాలమని, 420 దొంగ హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో నిలదీసి, ఉరికించి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఎన్నికల వాగ్దానాల ప్రకారం ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున బాకీ పడిందని ఆయన ధ్వజమెత్తారు.

​గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తిని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దామని ఎర్రబెల్లి గుర్తు చేశారు. సోమనాథుడు, బమ్మెర పోతన, వల్మీడి దేవస్థానాలను అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో నలువైపులా డబుల్ రోడ్లు వేయించింది తానేనని స్పష్టం చేశారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరిచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారని కొనియాడారు. కానీ నేడు కాంగ్రెస్ నేతలు అభివృద్ధి పేరిట కమీషన్ల కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

​అసెంబ్లీ వద్ద ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను ఎర్రబెల్లి తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులతో చేయిస్తున్న దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. 'ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. ప్రజలు అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తారు' అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని, పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story