Bhimadevarapalli: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం!
Bhimadevarapalli: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి నీళ్ళు నింపుతాం. గొల్లపల్లి గ్రామాభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ.
Bhimadevarapalli: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం!
Bhimadevarapalli: “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ఆదివారం గొల్లపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి, గేదెలకు గర్భకోశ వ్యాధుల నివారణ మందులు వేశారు. అనంతరం ప్రజల సమక్షంలో అధికారులతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా పాలనలో గొల్లపల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గొల్లపల్లి గ్రామంలో 3 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, మూడు ఇళ్లు పూర్తయ్యాయని, త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని మంత్రి తెలిపారు.
గ్రామంలో 55 పెన్షన్లకు రూ.1.57 లక్షలు విడుదల అవుతున్నాయని, కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు 11 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాతో 108 కుటుంబాలకు రూ.97,200 మేర లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 74 కుటుంబాలకు రూ.51,174 విడుదల చేశామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 13 ఎస్‌హెచ్‌జీలకు రూ.5.75 లక్షలు, బ్యాంక్ లింకేజీ కింద 13 ఎస్‌హెచ్‌జీలకు రూ.3.15 కోట్ల రుణాలు అందించామని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామంలోని మహిళా సంఘాల ద్వారా 300 స్టీల్ బ్యాంక్ కిట్లను, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులతో అందించామని తెలిపారు. 47 మంది రైతులకు రూ.51.18 లక్షల రైతు రుణమాఫీ, 255 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.1.12 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. రైతు బీమా కింద ఒక రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించామని, సన్న వడ్ల బోనస్ కింద నలుగురు రైతులకు రూ.60 వేలు విడుదల చేశామని తెలిపారు.
16 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 200 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గ్రామంలో రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల పనులు పూర్తి చేశామని, 145 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించామని, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం నా బాధ్యత. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టులో నీళ్లు నింపే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.. “గౌరవెల్లి కాలువల భూసేకరణకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా కొట్టివేయబడింది. త్వరలోనే ప్రాజెక్టులో నీళ్లు నింపుతాం” అని మంత్రి తెలిపారు.
గొల్లపల్లి అభివృద్ధికి హామీలు
గ్రామ సర్పంచ్ నేతుల చంద్రమోహన్, గ్రామ ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై మంత్రి స్పందిస్తూ:
గొల్లపల్లి బస్ స్టేషన్ నుంచి ముత్తారం–గట్ల నర్సింగాపూర్ వైపు రహదారి నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదన పంపామని, త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు.
గొల్లపల్లి నుంచి వీరన్న నాయక్ తండాకు రహదారి, గొల్లపల్లి గుడి నుంచి వీరభద్రనగర్ వరకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలో విద్యుత్ పోల్స్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
గ్రామానికి ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీఓ, అంగన్వాడీ భవనాల కోసం స్థలం చూపిస్తే వాటిని మంజూరు చేస్తామని తెలిపారు.
స్థల సేకరణ చేసి తీర్మానం చేసిన వెంటనే గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, మహిళా భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో నీటి సమస్యలను పరిష్కరిస్తామని, అవసరమైన చోట్ల పైప్‌లైన్, బోర్, మోటార్ తదితర సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు తన సహకారం ఉంటుందని తెలిపారు.
ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
జల సిరి పథకం కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.6,500, పొలం కుంటకు రూ.1.30 లక్షలు అందిస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని మంత్రి సూచించారు.
ప్లాస్టిక్‌కు బదులు స్టీల్ బ్యాంక్ వినియోగించాలి
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి స్టీల్ బ్యాంక్‌ను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
పెన్షన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తులు
కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్‌ఐవీ బాధితులు తదితర అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
క్రీడలను ప్రోత్సహిస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో క్రీడా సామగ్రిని అందించామని, గొల్లపల్లి గ్రామానికి క్రికెట్ కిట్, వాలీబాల్ తదితర క్రీడా సామగ్రి అందించామని చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే మంచి గుర్తింపు లభించడంతో పాటు, సర్టిఫికెట్ల ద్వారా ఇండియన్ ఆర్మీ, పోలీస్ శాఖ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని యువతకు సూచించారు.
విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా మైదానాలకు వెళ్లి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవల హుస్నాబాద్ మినీ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాలలకు పెయింటింగ్ తదితర పనులు చేపడతామని తెలిపారు.
14–15 సంవత్సరాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు వేయించాలని, అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలి
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకునే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఉద్యానవన అధికారి కమలాకర్ రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ నేతుల చంద్రమోహన్, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




