Mulugu: గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Mulugu: గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో మంగపేట, రామన్నగూడెం ఘాట్ల మరమ్మతులు, అనుసంధాన రహదారులపై కలెక్టర్ బోర్ఖడే హేమంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Updated on: 5 Nov 2026 9:03 PM IST
Mulugu
X

Mulugu: గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Mulugu: గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

పుష్కర ఘాట్లను సంసిద్ధం చేసేందుకు అవసరమైన మరమ్మతులు, నూతన పనుల ప్రతిపాదనల రూపకల్పనను వేగవంతం చేయాలని సూచించారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా లతో కలిసి గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టైర్‌–1, టైర్‌–2, టైర్‌–3 ప్రాతిపదికన మంగపేట, చుంచుపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్లను సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, అదనపు నిర్మాణాలు, నూతన పనులను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

పుష్కర ఘాట్ల వరకు భక్తులు సులభంగా చేరుకునేందుకు అనుసంధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. రహదారులకు అవసరమైన భూసేకరణ, భూముల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఘాట్ల వద్ద స్వచ్ఛమైన తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, విద్యుత్‌ దీపాలు తదితర సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వ్యర్థాల సేకరణ, తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రవాణా, పార్కింగ్‌ ఏర్పాట్లపై సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను ముందుగానే గుర్తించాలని సూచించారు.

ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్‌లు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమ పరిధిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.