Warangal: పారిశుద్ధ్యానికి అంతర్జాతీయ గుర్తింపు జపాన్ ఏడీబీఐ కన్సల్టెంట్

Warangal: గ్రేటర్ వరంగల్ అమ్మవారిపేటలోని మలశుద్ధీకరణ కేంద్రాలను (FSTP) ఏడీబీఐ జపాన్ కన్సల్టెంట్ కజుషి హషిమోటో పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణను అభినందించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 July 2026 10:05 PM IST
Warangal
X

Warangal: పారిశుద్ధ్యానికి అంతర్జాతీయ గుర్తింపు జపాన్ ఏడీబీఐ కన్సల్టెంట్

వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో అమలు చేస్తున్న మలశుద్ధీకరణ, మలవిసర్జన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ విధానాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ (ఏడీబీఐ) జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రశంసించారు.

ముందుగా ప్రతినిధుల బృందం అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన రోజుకు 15 కిలోలీటర్లు, 150 కిలోలీటర్ల సామర్థ్యం గల మలశుద్ధీకరణ కేంద్రాలను సందర్శించి, అక్కడ అమలవుతున్న శుద్ధీకరణ ప్రక్రియ, నిర్వహణ విధానాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, జిడబ్లుఎంసి ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయ్, బల్దియా కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, నగరంలో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సుస్థిర పారిశుద్ధ్య విధానాలను ప్రోత్సహించే క్రమంలో జీడబ్ల్యూఎంసీ, ఆస్కీ సంస్థల సహకారంతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

దేశంలోనే తొలిసారిగా అమ్మవారిపేటలో రోజుకు 15 కిలోలీటర్ల సామర్థ్యంతో మలశుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పైరోలసిస్ విధానం ద్వారా మలాన్ని సేంద్రీయ ఎరువుగా మార్చి వ్యవసాయ భూముల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని రహదారి మధ్య విభజన ప్రాంతాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నామని వివరించారు. నగర అవసరాలకు అనుగుణంగా ఇటీవల రోజుకు 150 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆధునిక మలశుద్ధీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

గ్రేటర్ వరంగల్‌లో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, మలశుద్ధీకరణ సాంకేతికత, వనరుల పునర్వినియోగ విధానం ఆదర్శప్రాయంగా ఉన్నాయని డాక్టర్ కజుషి హషిమోటో ప్రశంసించారు. ఈ తరహా సుస్థిర పారిశుద్ధ్య నమూనాలు ఇతర పట్టణాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో సీఎం హెచ్ ఓ డా. రాజారెడ్డి, ఈఈలు మహేందర్, స్పందన, ఆస్కీ ప్రతినిధులు డా. స్నేహలత, రాజ్‌మోహన్ రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story