Warangal: బల్దియా ప్రజావాణిలో 81 దరఖాస్తులు..కమిషనర్ వెంకన్న ఆదేశాలు!

Warangal: వరంగల్ బల్దియా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 81 దరఖాస్తుల స్వీకరణ. బతుకమ్మ-దసరా ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్‌పై కమిషనర్ సమీక్ష.

MD. AMEER, WARANGAL EAST
Published on: 5 Oct 2026 4:15 PM IST
Warangal
X

Warangal: బల్దియా ప్రజావాణిలో 81 దరఖాస్తులు..కమిషనర్ వెంకన్న ఆదేశాలు!

Warangal: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అన్నారు.

సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 81 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు అప్పగించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని, సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికీ తావివ్వరాదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రతి సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండాలని సూచించారు.

పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

గత వారం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు, తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల సమస్యలను కేవలం దరఖాస్తులుగా కాకుండా, పౌరుల సమస్యలకు పరిష్కారం అందించాల్సిన బాధ్యతగా అధికారులు భావించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా అనవసర జాప్యం చోటుచేసుకుంటే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.

విభాగాల వారీగా స్వీకరించిన దరఖాస్తులు

- టౌన్ ప్లానింగ్: 32

- ఇంజినీరింగ్: 28

- ఆరోగ్యం, పారిశుద్ధ్యం: 09

- రెవెన్యూ: 09

- నీటి సరఫరా: 03

- మొత్తం: 81 దరఖాస్తులు

బతుకమ్మ–దసరా పండుగలకు సమన్వయంతో ఏర్పాట్లు. ప్రజావాణి అనంతరం అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గతంలో మాదిరిగా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పండుగల నేపథ్యంలో ప్రజల రద్దీ, ప్రధాన కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారుల మరమ్మతులు, వెలుగుల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు.

అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు పండుగలను ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా బల్దియా తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను సమన్వయంతో చేపట్టి, పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబులతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST