Warangal: గణేశ్ విగ్రహాల విక్రయాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వహించాలి కమిషనర్!
Warangal: వరంగల్‌లో విగ్రహాల విక్రయాలు, ట్రాఫిక్ నియంత్రణపై బల్దియా కమిషనర్ టి. వెంకన్న పోలీసు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Warangal: గణేశ్ విగ్రహాల విక్రయాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వహించాలి కమిషనర్!
వరంగల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో గణేశ్ విగ్రహాల విక్రయాలు ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేశ్ విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు సహకరించాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న సూచించారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో బల్దియా టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు, గణేశ్ విగ్రహాల తయారీదారులు, విక్రయదారులతో కమిషనర్ వెంకన్న సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాల విక్రయాల కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రధాన రహదారులు, డ్రైనేజీలపై విగ్రహాలను ఏర్పాటు చేసి విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా గుర్తించిన అనువైన ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేసి విక్రయించాలని సూచించారు.
గణేశ్ విగ్రహాల విక్రయాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ కోరారు. విక్రయదారులు, తయారీదారులు అధికారులు సూచించే నిబంధనలను పాటిస్తూ సహకరించాలని తెలిపారు.
నగరంలో గణేశ్ విగ్రహాల విక్రయాలకు అనువైన ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లు కమిషనర్ వెల్లడించారు. హన్మకొండలోని పద్మాక్షి మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్స్, ఉర్సు, ఓసిటీ మైదానం, ఖిలా వరంగల్‌లోని మైదానాలు, అలాగే తోట మైదానాలను అవసరానుసారం వినియోగించుకునేలా గుర్తించినట్లు తెలిపారు.
గణేశ్ విగ్రహాల విక్రయదారుల సంఘం ప్రతినిధుల సూచనలు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని గుర్తించిన ప్రాంతాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాల విక్రయాలకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో విక్రయదారులకు అనుకూలంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. విక్రయాలు క్రమబద్ధంగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా జరిగేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విక్రయదారులు తమ కార్యకలాపాలను నిర్వహించాలని, తద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ టి. వెంకన్న కోరారు.
ఈ సమావేశంలో బల్దియా సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్,ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్,టౌన్ ప్లానింగ్ ఏ సి పి ఖలీల్ ట్రాఫిక్ సీఐలు సుజాత,వెంకన్న, రామకృష్ణ, లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్‌ఐలు టౌన్ ప్లానింగ్ అధికారులు, గణేశ్ విగ్రహాల తయారీదారులు, విక్రయదారుల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




