Hanamkonda: హనుమకొండలో రైస్ ట్రేడర్స్‌పై ఆకస్మిక తనిఖీలు!
Hanamkonda: హనుమకొండ నయీంనగర్‌లోని రైస్ దుకాణాల్లో అదనపు కలెక్టర్ రవి తనిఖీలు చేశారు. 25 కేజీల బస్తాలో తూకం తక్కువ రావడంతో గణపతి రైస్ ట్రేడర్స్ యజమానిపై కేసు నమోదు చేశారు.
Hanamkonda: హనుమకొండలో రైస్ ట్రేడర్స్‌పై ఆకస్మిక తనిఖీలు!
హనుమకొండ: హనుమకొండ నయీమ్ నగర్ లోని గణపతి రైస్ ట్రేడర్స్, చిదర సంపత్ కుమార్ ఫుడ్ గ్రేన్ డీలర్, శ్రీ శ్యామ్ ట్రేడర్స్ దుకాణాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, పౌర సరఫరాల శాఖ అధికారులు, తూనికలు కొలతలు శాఖల అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.
ఈ తనిఖీల సందర్భంగా రైస్ బ్యాగుల తూకాలు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైస్ విక్రయాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకుని వాటి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీశారు.
కాగా గణపతి రైస్ ట్రేడర్స్ లో తనిఖీల సందర్భంగా అక్కడి బియ్యం బస్తాలను తూకం వేశారు. ఇందులో ఇరవై ఐదు కిలోల సంచులలో ఒక్కోదానిలో ఒకటి నుండి ఒకటిన్నర కిలోల వరకు తక్కువగా బియ్యం ఉన్నట్లు అదనపు కలెక్టర్, అధికారులు గుర్తించారు.
వినియోగదారులను మోసం చేస్తూ తక్కువ బరువు కలిగి ఉన్న బియ్యం సంచులను విక్రయిస్తున్నందుకు గణపతి రైస్ ట్రేడర్స్ యజమానిపై ప్రభుత్వ నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ రవి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ రైస్ విక్రయ దుకాణాలలో ప్రభుత్వ నిర్దేశిత ధరలకు మాత్రమే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా నిర్ణీత తూకం కంటే తక్కువ తూకం ఉన్న రైస్ బ్యాగులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ తనిఖీలలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్, డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రప్రసాద్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు భద్రు నాయక్, భాస్కర్ రెడ్డి, తూనికలు కొలతల శాఖ అధికారులు విశ్వశ్వర్, తదితరులు పాల్గొన్నారు.




