Hanamkonda: హనుమకొండ కోర్టులో ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన!
Hanamkonda: హనుమకొండ కోర్టులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు పాల్గొన్నారు.
Hanamkonda: హనుమకొండ కోర్టులో ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన!
హనుమకొండ: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన ఆత్మీయ పరిచయ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ ఖాన్, కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులు జిల్లా కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు హెల్ప్ డెస్క్‌ను సందర్శించారు. అనంతరం రెండు బార్ అసోసియేషన్లతో పాటు మహిళా బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఛాంబర్‌ను సందర్శించి న్యాయవాదులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా రామారెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ, హనుమకొండ జిల్లా కోర్టు సముదాయంలో సుమారు 3 వేల మందికి పైగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, క్లయింట్లతో కలిపి సమాజంపై విశేష ప్రభావం చూపగల మేధావి వర్గంగా న్యాయవాదులు ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6 చివరి తేదీ అని, అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు తమ సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని, ముఖ్యంగా హెల్త్ కార్డుల సమస్యతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
వరంగల్ నగర అభివృద్ధి గురించి మాట్లాడుతూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రజాప్రతినిధులతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.




