Hanumakonda: హనుమకొండలో 200 మందికి కుట్టు మిషన్ల పంపిణీ!
Hanumakonda: హనుమకొండ అంబేడ్కర్ భవన్‌లో 200 మంది మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అర్హతే ప్రామాణికం.
Hanumakonda: హనుమకొండలో 200 మందికి కుట్టు మిషన్ల పంపిణీ!
Hanumakonda: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 200 మంది అర్హులైన ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పేదలు, మహిళలు, రైతులు, కార్మికులు, మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు. రోటి కపడా ఔర్ మకాన్-జై జవాన్, జై కిసాన్ వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇందిరా మహిళా మైనారిటీ యోజన పథకం కింద వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 55 మంది ఒంటరి ముస్లిం మైనారిటీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కులు అందించే కార్యక్రమాన్ని త్వరలో చేపడుతామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.
అదేవిధంగా దూదేకుల, ఫకీర్ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 100 శాతం రాయితీతో ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించేలా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, తక్కువ సమయంలోనే వారికి ఈ ప్రయోజనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మహిళలకు, మైనారిటీ వర్గాలకు అందుతున్న ఈ ఆర్థిక సహాయాన్ని స్వయం ఉపాధి కోసం వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాకుండా వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉపయోగపడే అవకాశమని అన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల జనాభా గణనీయంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేగా మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నానని నాయిని అన్నారు.మైనారిటీ మత పెద్దలు, నాయకుల సూచనలు తీసుకుంటూ వారి అవసరాలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అధికార దుర్వినియోగానికి, ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా మైనారిటీ పెద్దలు, నాయకుల సూచనల మేరకే వారి సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా నియోజకవర్గంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారి ఇంటి గడప వరకు చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు, మైనారిటీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




