Hanamkonda: అధికారం పోయిందన్న అక్కసుతోనే BRS విమర్శలు ఎంపీ డా. కడియం కావ్య!

Hanamkonda: హన్మకొండ డీసీసీ కార్యాలయంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మీడియా సమావేశం. కాంగ్రెస్ 1000 రోజుల పాలనే తమ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అని వెల్లడి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Sept 2026 8:32 AM IST
Hanamkonda
X

Hanamkonda: అధికారం పోయిందన్న అక్కసుతోనే BRS విమర్శలు ఎంపీ డా. కడియం కావ్య!

Hanamkonda: హనుమకొండ డిసిసి కార్యాలయంలోని మీడియా సమావేశంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ...

అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా. కడియం కావ్య మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం రెండుమూడేళ్లు కూడా ఓపికగా ఉండలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై విమర్శలు చేయడం వారి అధికార దాహాన్ని బయటపెడుతోంది అని అన్నారు.

“పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన రెండుమూడేళ్లకే ఓపిక నశిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజలపై ప్రేమ కాదు.. అధికారం కోల్పోయామన్న అక్కసు, తిరిగి అధికారం కోసం పడుతున్న ఆరాటం” అని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండున్నరేళ్లలోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని ఎంపీ తెలిపారు. విద్యార్థి ఏడాది చదువుకున్న తర్వాత తన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను చూసుకున్నట్లే.. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు తాము చేసిన పనులే ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అన్నారు.

“మేము నోటి మాటగా చెప్పడం లేదు. ఏం చేశామో.. ఎంత చేశామో గణాంకాలతో సహా ప్రజల ముందుంచాం. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనకు తేడాను ప్రజలే గమనిస్తున్నారు” అని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల భారంలోకి నెట్టి వెళ్లినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఆపకుండా, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. “అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివి. ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాం” అని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఎంపీ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను ఉపయోగించుకున్నారని, తెలంగాణ కోసం 1200 మందికి పైగా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు “విద్యార్థులను ఉద్యమానికి ఉపయోగించుకున్న బీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్‌ కోసం ఏం చేసింది? యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లను నియమించారా? ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై ఎప్పుడైనా సమీక్ష చేశారా?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు చేపట్టడంతో పాటు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందన్నారు.

విద్యార్థులకు పాఠశాలలు ఉండటం మాత్రమే కాకుండా నాణ్యమైన బోధన అందించేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలని ప్రభుత్వం భావించిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు.

“తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పారు. కానీ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండున్నరేళ్లలోనే వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం” అని అన్నారు.

మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు ‘ఎవరు అడిగారు?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ మా ఉద్దేశం మహిళలకు కేవలం ఉచితాలు ఇవ్వడం కాదు.. వారు ఆర్థికంగా ఎదిగి, వ్యాపారవేత్తలుగా మారాలి” అని అన్నారు.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు రూ.60 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పెట్రోల్‌ బంకులు, సోలార్‌ పవర్‌ ప్లాంట్లు తదితర రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పేదలకు ఎన్నో హామీలు ఇచ్చినా.. అనేక ప్రాంతాల్లో ఇళ్లు అసంపూర్తిగా వదిలేసిందని ఎంపీ విమర్శించారు. “డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పదేళ్లు కథలు చెప్పారు. పేదలకు పూర్తిస్థాయిలో ఇళ్లు అందించలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది” అని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం లేదని స్పష్టం చేశారు. అర్హత ఆధారంగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎంపిక జరుగుతోందని, కాంగ్రెస్‌ కార్యకర్తలకే పథకాలు దక్కాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ అనుభవం ఉందని, ఆయన నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని కావ్య అన్నారు. “కేసీఆర్‌ గారికి అనుభవం ఉంది. అభివృద్ధికి ఉపయోగపడే సూచనలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారు. కానీ ప్రతిరోజూ రాజకీయ విమర్శలు చేయడం, కాలయాపన చేయడం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదు” అని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని కోరారు.

“ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చారు.. మరో పార్టీకి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను గౌరవించాలి. రెండుమూడేళ్లు కూడా ఓపిక పట్టలేకపోవడం ఎందుకు? ‘మా సమయం వస్తుంది’ అని ప్రజల్లో ఉండి పనిచేయాలి. అంతే తప్ప అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై బురదజల్లడం సరైన రాజకీయ విధానం కాదు” అని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను కూడా చేపడుతోందని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు.

“బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేయలేని అనేక పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించింది. ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు ఇదే మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు” అని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.

అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో వరంగల్ ఎంపి డా.కడియం కావ్య ఘనంగా నివాళులర్పించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story