Hanamkonda: భీమారంలో ఘోర కలి: తండ్రిని కాపాడబోయి నవవరుడు మృతి
Hanamkonda: హనుమకొండ భీమారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Hanamkonda: భీమారంలో ఘోర కలి: తండ్రిని కాపాడబోయి నవవరుడు మృతి
Hanamkonda: ఆ ఇంట్లో పెళ్లి వేడుక జరిగి వారం కూడా కాలేదు. బంధుమిత్రుల కోలాహలం, శుభాకాంక్షల సందడి ఇంకా తగ్గనే లేదు. (జూన్ 29) సదరు యువకుడు తన పుట్టినరోజు వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. కానీ, అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. తండ్రి ప్రాణాలు కాపాడబోయి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యను ఒంటరిని చేస్తూ ఓ నవవరుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన హృదయవిదారక ఘటన జరిగింది.
హనుమకొండ పరిధిలోని భీమారానికి చెందిన శరత్ అనే యువకుడికి ఈ నెల 24వ తేదీన మౌనికతో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లయిన అనంతరం ఈ నెల 26న కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా రిసెప్షన్ వేడుకను కూడా నిర్వహించారు. పెళ్లి తాలూకు ముచ్చట్లు ముగియక ముందే, జూన్ 29న శరత్ తన పుట్టినరోజును భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నాడు.
అయితే జూన్ 30న ఇంట్లో ఒక ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. శరత్ తండ్రి సాంబయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. అది గమనించిన శరత్, క్షణమైనా ఆలోచించకుండా తన తండ్రిని కాపాడుకోవాలనే ఆరాటంతో ముందుకు ఉరికాడు. తండ్రిని విద్యుత్ వైర్ల నుండి పక్కకు లాగే క్రమంలో శరత్‌కు కూడా తీవ్రంగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో శరత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదృష్టవశాత్తు తండ్రి ప్రాణాలతో బయటపడినప్పటికీ, కండ్ల ముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
పెళ్లయిన ఐదు రోజులకే, పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే భర్త అనంతలోకాలకు వెళ్లిపోవడంతో నవవధువు మౌనిక తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చేతికి ఉన్న మెహందీ ఆరకముందే, పసుపు తాడు పచ్చగా ఉండాలనే నూరేళ్ల నమ్మకం ఐదు రోజులకే ముక్కలు కావడంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ ఘోర కలిని చూసి స్థానికులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. భీమారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




