Hanumakonda: జలసిరి లక్ష్యాలను సాధించాలి అదనపు కలెక్టర్ శేషాద్రి

Hanumakonda: హనుమకొండ కలెక్టరేట్‌లో జలసిరి పంట కుంటల ఏర్పాటుపై సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలను తప్పకుండా సాధించాలని అదనపు కలెక్టర్ శేషాద్రి ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Aug 2026 6:00 PM IST
Hanumakonda
X

Hanumakonda: జలసిరి లక్ష్యాలను సాధించాలి అదనపు కలెక్టర్ శేషాద్రి

హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా పంట కుంటల (ఫామ్ పాండ్స్) ఏర్పాటులో నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పకుండా సాధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీడీవోలు, ఎంపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జలసిరి గ్రామ అభివృద్ధి ప్రణాళిక అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. పంట కుంటల ఏర్పాటు వల్ల వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, సాగునీటి లభ్యత వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఈ అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పంట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

ఇప్పటికే పంట కుంటలు ఏర్పాటు చేసి ప్రయోజనాలు పొందుతున్న ప్రాంతాలకు రైతులను తీసుకెళ్లి ప్రత్యక్షంగా వాటి ఉపయోగాలను వివరించాలని అధికారులకు సూచించారు. దీనివల్ల రైతుల్లో అవగాహన పెరిగి పంట కుంటల ఏర్పాటుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు.

గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో అన్ని అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం సాధించి, గ్రామ సభల ద్వారా త్వరితగతిన సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాస్త్రీయ ప్రణాళికతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే గ్రామీణాభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు జల సంరక్షణ చర్యలు అత్యంత అవసరమని అన్నారు. పంట కుంటలు, ఊర కుంటలు, ఇంకుడు గుంతలు వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్. రమాకాంత్, ఎంపీడీవోలు, ఎంపీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story