Hanumakonda: ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది!

Hanumakonda: హనుమకొండలో ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. ఆంగ్ల భాష, కృత్రిమ మేధస్సు (AI) పై అవగాహన పెంచాలని ఉపాధ్యాయులకు సూచన.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 July 2026 4:52 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది!

Hanumakonda: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భావి జీవితానికి బలమైన పునాదిని పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

గురువారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ (రెండో విడత) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడి, శిక్షణ ద్వారా నేర్చుకుంటున్న అంశాలు, వాటిని తరగతి గదిలో ఎలా అమలు చేయనున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బోధనా నైపుణ్యాల పెంపు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇటువంటి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ముఖ్యంగా ఆంగ్ల భాషపై పట్టు పెంపొందేలా బోధన సాగించాలని, తద్వారా వారి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ కెరీర్‌కు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు.

ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్లే ముందు పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో సిద్ధమై బోధించాలని, ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అత్యుత్తమ విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

అదేవిధంగా, విద్యా రంగంలో వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన పెంపొందించుకోవాలని, విద్యార్థులకు కూడా దాని ఉపయోగాలు, అవకాశాలపై సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, అభ్యాస పద్ధతులు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలోని వంటశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారని వంట నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు ఆలూ కర్రీ తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలపగా, వండిన అన్నం, కూర నాణ్యతను పరిశీలించారు.

కిచెన్ షెడ్డులో పరిశుభ్రత, ఆహార తయారీ విధానాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ నెహ్రూ నాయక్, ఉపాధ్యాయులు, శిక్షణలో పాల్గొన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story