Hanumakonda: హనుమకొండ ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్
Hanumakonda: హనుమకొండలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. జూలై 14 లోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని బీఎల్ఓలకు కఠిన ఆదేశాలు.
Hanumakonda: హనుమకొండ ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్
హనుమకొండ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి స్పష్టం చేశారు. శనివారం హనుమకొండ పట్టణంలోని గాంధీనగర్, అశోక్ కాలనీ, గోకుల్ నగర్, లష్కర్ సింగారం, లష్కర్ బజార్ తదితర ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఎస్ఐఆర్ నమోదు ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) మాట్లాడిన కలెక్టర్, ఫారముల స్వీకరణ, వాటి డిజిటలైజేషన్ పురోగతి, పెండింగ్ వివరాలను స్వయంగా పరిశీలించారు. లష్కర్ బజార్ పరిధిలో డిజిటలైజేషన్ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంబంధిత బీఎల్ఓను మందలించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల 14వ తేదీలోపు ఎస్ఐఆర్ నమోదు ఫారాల డిజిటలైజేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు అందిన దరఖాస్తులను అదే రోజు డిజిటలైజ్ చేసి పెండింగ్ లేకుండా చూడాలని, పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని సూచించారు.
డిజిటలైజేషన్ శాతం తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి అధికారులు స్వయంగా సందర్శించి ప్రతిరోజూ సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి లక్ష్య సాధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఐకేపీ ఏపీఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలు, రిసోర్స్ పర్సన్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
సంబంధిత సిబ్బంది బీఎల్ఓలకు పూర్తిస్థాయిలో సహకరించి ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు ఓటు హక్కును కోల్పోకూడదని, ప్రతి అర్హ ఓటరిని గుర్తించి, వారి దరఖాస్తులను సకాలంలో స్వీకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయడం మనందరి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.
నేడు, రేపు (ఆదివారం) ప్రత్యేక కార్యాచరణతో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




