Hanumakonda: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట!
Hanumakonda: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన సెమినార్ హాల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రారంభించారు.
Hanumakonda: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట!
హనుమకొండ: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సెమినార్ హాల్‌ను శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ ఐఏఎస్ గారు పాల్గొన్నారు.
మొదటగా సెమినార్ హాల్ ఎదుట ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రి బాయ్ పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. రిబ్బన్ కట్ చేసి,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసి సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. కళాశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థినుల హాస్టల్ తదితర అవసరాలను గుర్తించి, వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతో పాటు కళాశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వరంగల్ విద్యా రంగ అభివృద్ధి కోసం ఎంపీ కడియం కావ్య గారితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సమష్టిగా పనిచేస్తేనే విద్యాసంస్థలకు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యపై పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలకు పెట్టుబడి వంటిదని, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎంపీ కడియం కావ్య గారు మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య ఎంత ఉందనే దానికంటే, కళాశాలలకు ఎంతమంది విద్యార్థులను రప్పించి నాణ్యమైన విద్య అందించగలుగుతున్నామనేదే ముఖ్యమని అన్నారు. కళాశాల విద్యార్థులే కాకుండా, బయట ఉండి వివిధ కారణాలతో చదువుకునే యువత అవసరాలను కూడా గుర్తించాలని సూచించారు. విద్యార్థులందరినీ మన పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల అభివృద్ధి కోసం తాను పార్లమెంట్లో నిరంతరం ప్రస్తావిస్తున్నానని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా, రూసా వంటి పథకాల కింద మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. విద్యాసంస్థలకు అవసరమైన నిధులు, పరిశోధన సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులు, అధ్యాపకులు తమ అవసరాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని, ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మొహమాటపడకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా ప్రభావానికి లోనై విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థులు సమాజానికి తిరిగి తమ వంతు సేవ చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా సమాజం మనకు చేసిన మేలును తిరిగి సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. డబ్బుతోనే సాయం చేయాల్సిన అవసరం లేదని, తమ అనుభవాన్ని, సమయాన్ని పేద విద్యార్థులకు అందించడం కూడా గొప్ప సేవ అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.




