Hanumakonda: వరంగల్ ఎంపీ కడియం కావ్యను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి!
Hanumakonda: హనుమకొండ ఎంపీ కార్యాలయంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఓటరు నమోదుపై చర్చించారు.
Hanumakonda: వరంగల్ ఎంపీ కడియం కావ్యను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి!
హనుమకొండ: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు.
ఈ మేరకు శనివారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎంపీ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యగారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని చర్చించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
పట్టభద్రుల ఓటరు నమోదు నుంచి ఎన్నికల నిర్వహణ వరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం, యువతతో పాటు విద్యావంతులను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై కూడా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు.




