Parkal: పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు!

Parkal: కార్తీక పౌర్ణమి సందర్భంగా హనుమకొండ జిల్లా పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకం, లక్ష దీపార్చన, జ్వాలా తోరణం, ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగాయి.

M PRABHAKAR, PARAKAL
Published on: 24 Nov 2026 11:03 AM IST
Parkal
X

Parkal: పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు!

పరకాల: కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని పరకాల పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయంలో శివనామస్మరణతో ఆలయం మార్మోగుతోంది. తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకంతో కార్యక్రమాలు మొదలయ్యాయని, లక్షదీపార్చన, జ్వాలా తోరణం, అన్నదాన కార్యక్రమం విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కోమల్లపల్లి సంపత్ కుమార్ శర్మ తెలిపారు.

లక్ష దీపార్చనతో వెలిగిపోతున్న ఆలయం

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష దీపార్చన కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కరించారు. దీపకాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కార్తిక మాసంలో దీపం వెలిగిస్తే సకల పాపాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

అనంతరం జ్వాలా తోరణం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జ్వాలా తోరణం దాటితే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

సాయంకాలం ఆకాశ దీపోత్సవం

సాయంకాలం ఆకాశ దీపోత్సవం కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని సంపత్ కుమార్ శర్మ తెలిపారు. ఆకాశంలోకి దీపాలు వదులుతూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL