Hanamkonda: ఓటరు జాబితా సవరణ విజయవంతం చేయండి: అబ్జర్వర్ హరి చందన
Hanamkonda: హనుమకొండలో ఓటరు జాబితా సమగ్ర సవరణ-2026పై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి ఐదు జిల్లాల కలెక్టర్లు, రాజకీయ పార్టీలతో కీలక సమీక్ష.
Hanamkonda: ఓటరు జాబితా సవరణ విజయవంతం చేయండి: అబ్జర్వర్ హరి చందన
Hanamkonda: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, శక్తి (SHAKTI) శాఖ కార్యదర్శి హరి చందన దాసరి పేర్కొన్నారు.
శనివారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తెలుసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వాటిపై సమగ్ర వివరణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు.
హరి చందన దాసరి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల్లో అపోహలు తొలగిస్తూ ఎన్నికల సంఘం నిబంధనలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు నిరంతరం శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొన్నారు. అలాగే అపార్ట్‌మెంట్ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏలు), గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి అర్హుడైన ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పురోగతిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, వాటిని తిరిగి సేకరించి సకాలంలో డిజిటలైజేషన్ పూర్తి చేసేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రతి అర్హుడైన ఓటరు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 55.60 శాతం ఎస్‌ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తైందని తెలిపారు. పురోగతి వేగవంతం కావాలంటే ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, వాటిని తిరిగి సేకరించి సకాలంలో డిజిటలైజేషన్ పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కుడా ఛైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామీరెడ్డి మాట్లాడుతూ, గ్రేటర్ పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, వాటిని సేకరించి వెంటనే డిజిటలైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటే నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో బీఎల్‌ఏల ద్వారా ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటిపై వివరణలు పొందారు.
ఈ సమావేశంలో
TPCC ప్రదాన కార్యదర్శి
ఇ. వి. శ్రీనివాస్ రావు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున నిశాంత్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున ప్రవీణ్ కుమార్, కుసుమ శ్యామ్ , నిషాంత్ ,పుప్పాల రజనీకాంత్, రాజిరెడ్డి, జైపాల్ రెడ్డి, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.




