Hanamkonda: శిశువులకు తొలి రక్షణ కవచం తల్లిపాలే: ఇన్‌చార్జి కలెక్టర్!

Hanamkonda: గోపాల్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాశన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Aug 2026 9:30 PM IST
Hanamkonda
X

Hanamkonda: శిశువులకు తొలి రక్షణ కవచం తల్లిపాలే: ఇన్‌చార్జి కలెక్టర్!

హనుమకొండ, ఆగస్టు 3: శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారమని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు. ప్రతి తల్లి తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, శిశువులకు సమయానుకూలంగా తల్లిపాలు అందించాలని సూచించారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం హనుమకొండ గోపాల్‌పూర్‌లోని ఎంపీపీఎస్ ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాశన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తన చేతుల మీదుగా అన్నప్రాశనం చేయించి ఆశీర్వదించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించే అమూల్యమైన ఆహారమని పేర్కొన్నారు. శిశువు జన్మించినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలనే ఇవ్వాలని, ఆ తరువాత ఏడో నెల నుంచి వైద్యుల సూచనల మేరకు అనుబంధ పోషకాహారం ప్రారంభించి, రెండు సంవత్సరాల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు.

పిల్లల తల్లులు తమ ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యవంతమైన తల్లే ఆరోగ్యవంతమైన బిడ్డకు పునాది అని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా గోపాల్‌పూర్ ఆరోగ్య కేంద్రం–1 పరిధిలోని చిన్నారులకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ చేతుల మీదుగా అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, అంగన్‌వాడీ సూపర్వైజర్లు జ్యోతి, ఝాన్సీ, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ప్రీతి, జెండర్ స్పెషలిస్ట్ స్వర్ణలత, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, సమత, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story