Jangaon: పాఠశాలల్లో ప్రతిరోజూ 30 నిమిషాల రీడింగ్ యాక్టివిటీ, యోగా!

Jangaon: జనగామలో 2026-27 అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యా ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలని సూచన.

MD AHMAD PASHA, JANGAON
Published on: 29 Aug 2026 2:55 PM IST
Jangaon
X

Jangaon: పాఠశాలల్లో ప్రతిరోజూ 30 నిమిషాల రీడింగ్ యాక్టివిటీ, యోగా!

Jangaon: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ రూపొందించిన 2026–27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అకడమిక్ క్యాలెండర్‌ను కేవలం తేదీల పట్టికగా కాకుండా పాఠశాల విద్యా ప్రణాళికకు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అందులో పేర్కొన్న కార్యక్రమాలను నిర్ణీత గడువుల్లో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.

జిల్లాలోని ప్రతి పాఠశాలకు అకడమిక్ క్యాలెండర్ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో నిర్వహించాల్సిన విద్యా, సహ పాఠ్య, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు వివరించారు.

ప్రతి నెలకు సంబంధించిన పని దినాలు, సెలవులు, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA) పరీక్షల షెడ్యూల్, మూల్యాంకనాలు, రికార్డుల నిర్వహణ గడువులు, జిల్లా, జాతీయ స్థాయి క్రీడలు, ప్రదర్శనలు, ప్రాజెక్టు పోటీలు, తదితర వివరాలను ఇందులో పొందుపరిచారన్నారు.

సెప్టెంబర్ నెల క్యాలెండర్‌లో 23 పని దినాలు, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశం, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, FA-2 పరీక్షల కాలపరిమితి, FA-2, సమగ్ర రికార్డుల పూర్తి తేదీలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల గడువు, జాతీయ స్థాయి ప్రదర్శనలు, ప్రాజెక్టు పోటీల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారన్నారు.

విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించేందుకు ప్రతిరోజూ 30 నిమిషాల రీడింగ్ యాక్టివిటీ, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజూ యోగా, ధ్యానం నిర్వహించేలా క్యాలెండర్‌లో ప్రత్యేకంగా ప్రాధాన్యం కల్పించారని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story